నెల రోజుల్లో పెళ్లి అనగా... రోడ్డు మీద గుంత ఓ వైద్యురాలి ప్రాణం తీసింది. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. ఇటీవల చెన్నైలో ఫ్లెక్సీ కారణంగా ఓ టెక్కీ ఎలా అయితే ప్రాణాలు కోల్పోయిందో... అలాగే రోడ్డు మీద ఉన్న గుంత ఓ డాక్టర్ ప్రాణాలు తీసింది. కాగా... ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ముంబయికి చెందిన నేహ షేక్(23) వైద్య విద్యను అసభ్యసించి.. ఇటీవల ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కాగా... ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 7వ తేదీన ఆమె వివాహం చేసుకోవాల్సి ఉంది. కాగా... బుధవారం ఆమె తన సోదరుడితో కలిసి ద్విచక్రవాహనం పై బివండి-వాడా రోడ్డు పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

రోడ్డుపై ఉన్న గుంత కారణంగా బైక్ అదుపుతప్పడంతో నేహా కింద పడింది. ఆ సమయంలో అటుగా వస్తున్న ట్రక్కు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆమె సోదరుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వీరిద్దరూ షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కాగా ట్రక్కు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... నెల రోజుల్లో పెళ్లి అనగా ఇలాంటి విషాదం జరగడంతో.. వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ప్రమాదానికి రోడ్డు సరిగా లేకపోవడమే కారణమని స్థానికులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి రోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు. రోడ్డు క్రాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజూ ఆ గుంతల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు కిందపడి గాయాలపాలౌతున్నారని  వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.