స్థానిక సంస్థల ఎన్నికల్లో కోవిడ్ రోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా కేరళ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. 

కేరళలో డిసెంబర్ 8, 10, 14 తేదీల్లో మూడు దశలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కేరళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కరోనా రోగులను ప్రత్యేక ఓటర్లుగా వర్గీకరించి వారికి దరఖాస్తులు, డిక్లరేషన్ ఫారాలను ఇచ్చేందుకు ప్రత్యేక పోలింగు బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

నవంబరు 29వతేదీ నాటికి 24,621 మంది ప్రత్యేక ఓటర్లతో జాబితాను రూపొందించామని ఓటింగుకు ముందురోజు వరకు ఈ జాబితాను సవరించనున్నట్లు కేరళ ఎన్నికల కమిషనర్ వి భాస్కరన్ తెలిపారు.

ప్రత్యేక పోలింగు అధికారి , పోలింగ్ సహాయకుడు, పోలీసు అధికారితో కూడిన జట్టు ప్రత్యేక ఓటర్లు, కొవిడ్ చికిత్స కేంద్రాలు, ఆసుపత్రులకు వెళతాయని భాస్కరన్ చెప్పారు. డిక్లరేషన్ ఫారంపై పోలింగు అధికారి సంతకం తీసుకొని పోస్టల్ బ్యాలెట్ ను జారీ చేస్తారని ఎన్నికల కమిషనర్ చెప్పారు.

ఓటు వేశాక దాన్ని ఎన్నికల అధికారికి కవరులో అందజేయవచ్చు. కేరళలో 6 లక్షలమందికి కరోనా సోకగా వారిలో 2,200 మంది మరణించారు.