చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ సెక్స్ రాకెట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే 20 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఎర వేసి, వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని, ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి వ్యాపారం చేసుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు ఆ ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. 

ఈ ముఠా సభ్యులు 200 మందికి పైగా అమ్మాయిలను మోసగించినట్లు సమాచారం. బాధితులంతా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు చెందినవారు. ఈ రాకెట్‌ను నడిపించిన ముఠాలోని ఒకడు అధికార అన్నాడీఎంకేకు చెందిన యువనేత కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. 

పోలీసుల కథనం ప్రకారం ఫేస్‌బుక్‌తో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ వారితో గడపడం, వారి నగ్న దృశ్యాలను వీడియోలు తీసి బెదిరించి అత్యాచారం చేయడం, ఆ తర్వాత అశ్లీల దృశ్యాలున్న వీడియోలను కుటుంబ సభ్యులకు చూపుతామంటూ డబ్బులు లాగడం .. ఇదే పనిగా పెట్టుకుని ఈ ముఠా సభ్యులు కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
 
చివరకు, బాధితులు బయటికి వచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో, ఏడేళ్లుగా ఈ రాకెట్‌ ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ ముఠా బారినపడిన ఓ కళాశాల విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన శబరిరాజన్‌(25), తిరునావుక్కరసు (25) సతీశ్‌(28), వసంతకుమార్‌(27) లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో ఎంతోమంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. వాటి ఆధారంగా 200 మందికిపైగానే బాధితులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే సోదరుడిని చంపేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు కూడా. ఈ వ్యవహారంలో సెంథిల్‌(33), బాబు (26), నాగరాజ్‌ (27లను) పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజ్‌ అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడు. 

అరెస్టు అయిన ఒకట్రెండు రోజుల్లోనే నాగరాజ్‌ బెయిల్‌పై బయటకు రావడం కలకలం రేపింది. అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడిన ముఠాకు అధికార అన్నాడింకె రక్షణగా ఉంటోందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విమర్శించారు. 

పొల్లాచ్చి ముఠాలోని శబరిరాజన్‌, తిరునావుక్కరసు, సతీశ్‌, వసంతకుమార్‌లపై గూండా చట్టం ప్రయోగించినట్లు కోయంబత్తూరు జిల్లా ఎస్పీ పాండ్యరాజన్‌ తెలిపారు. పొల్లాచ్చి సంఘటనతో సంబంధం ఉన్న నాగరాజ్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు అన్నాడీఎంకే అధిష్ఠానం సోమవారం ప్రకటించింది.