కర్ణాటక రాజకీయాల్లో యోధుడిగా పేరున్న ఎస్.శంకరప్ప శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో ఆయన కీలక నేతగా ఉన్నారు.
కేఎస్ ఈశ్వరప్ప.. ఈ పేరుకు కర్ణాటక బీజేపీలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వంలో ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు మంత్రిగా పని చేస్తున్నారు. అయితే ఆయన శుక్రవారం ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, రాజకీయ యోధుడిగా పేరు గడించిన ఆయన ఒక్క సారిగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ? ఆయన నేపథ్యం ఏమిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈశ్వరప్ప కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యంలో లేదు. అయితే ఆయన చదువుకునే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)తో సంబంధాలు ఉన్నాయి. అందులో నుంచే విద్యార్థి రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇదే ఆయన రాజకీయ ప్రస్థానానికి మొదటి మెట్టు. ఆయన 1989లో కర్ణాటక శాసనసభకి శివమొగ్గ నుంచి అరంగేట్రం చేసాడు. ఇదే ప్రాంతం నుంచి మరో రాజకీయ ప్రముఖుడు కూడా ఉన్నారు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి BS యడియూరప్ప. అయితే వీరిద్దరికి మధ్య విభేదాలు ఉన్నాయి.
గతేడాది బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ఉన్నారు. అదే సమయంలో ఆయన మంత్రి వర్గంలో ఈశ్వరప్ప మంత్రిగా ఉన్నారు. అయితే సీఎం తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఈశ్వరప్ప గవర్నర్ కు లేఖ రాశారు. ఇది పరిణామం సహజంగానే అధికార పక్షానికి తీవ్ర ఇబ్బందిని కలిగించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. యడియూరప్పలా కాకుండా ఈశ్వరప్ప ఎప్పుడూ బీజేపీకి చెందిన వ్యక్తిలానే ఉన్నారు. కొంత సమయం యడియూరప్ప కర్ణాటక జనతా పార్టీ స్థాపించడానికి ప్రయత్నించారు. అయితే ఆయనకు ప్రజల్లో బలమైన బీజేపీ నాయకుడు అని బలమైన పేరు ఉంది. ప్రజల్లో పట్టు కూడా ఉంది.
ఈశ్వరప్ప కు ఇప్పుడు 73 సంవత్సరాలు. అయితే కర్ణాటక రాజకీయాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. 2012 నుండి 2013 వరకు జగదీష్ షెట్టర్ గా ఉన్న కాలంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఆయన BJP చీఫ్ గా, కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు.
ఎందుకు రాజీనామా చేశారు ?
ఇటీవల సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. అతడు తన ఆత్మహత్యకు కారణాలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. తాను చెప్పటిన పనుల బిల్లుల్లో మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారంటూ అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ లపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తాను మంత్రిగా కొనసాగితే విచారణను ప్రభావితం చేశానని అపవాదు ఉంటుందని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను నిర్దోషిగా బయటకు వస్తానని, మళ్లీ మంత్రినవుతానని తెలిపారు.
ఇదిలా ఉండగా ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ తన సూసైడ్ లేఖలో తన కుటుంబానికి అండగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కోరారు. అయితే ఈ వివాదం నుంచి ఈశ్వరప్ప క్లియర్ అవుతారని, మంత్రిగా తిరిగి వస్తారని యడియూరప్ప చెప్పారు. ఈశ్వరప్ప కోసం తాను ప్రార్థిస్తానని ఆయన అన్నారు. దీంతో ఇద్దరి మధ్య కొంత సఖ్యత కుదిరిన్నట్టు తెలుస్తోంది.
యడ్యూరప్ప ఒక లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాష్ట్రంలో ఇది ఆధిపత్య కులం. రాజకీయ ఫలితాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుందని అందరూ విశ్వసిస్తారు. కాగా ఈశ్వరప్ప ఒక కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇది వెనుకబడిన కులం. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదే కులానికి చెందినవారు. అయితే ఈశ్వరప్ప బీజేపీలో అత్యంత వెనుకబడిన కుల నాయకుడిగా ప్రాముఖ్యత ఉంది.
ఈశ్వరప్ప సాదాసీదాగా మాట్లాడతారు. తరచుగా వివాదాస్పద ప్రకటనలు చేస్తుంటారు. రాష్ట్రంలో ఇటీవల హిజాబ్ వివాదం సందర్భంగా ఎర్రకోటపై ఏదో ఒక రోజు కాషాయ జెండా రెపరెపలాడుతుందని వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలో బజరంగ్‌దళ్ కార్యకర్త హత్యకు గురైన తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అతడి అంత్యక్రియల సమయంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని ఆరోపణలు కూడా వచ్చాయి.
అయితే కాంట్రాక్టర్ సంతోష్ ఆత్మహత్య విషయంలో ఈశ్వరప్ప పేరు బయటకు రావడంతో ఆయన రాజీనామా చేశారు. మరి సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన తిరిగి మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. కానీ అతడిని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకుంటే ఈశ్వరప్పకు వెనకబడిన కులాల్లో ఉన్న ప్రాముఖ్యత, సీనియారిటీ పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా ఈశ్వరప్పపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొటున్న ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది.
