రాజకీయ వ్యూహకర్త, I-PAC అధిప‌తి ప్రశాంత్ కిషోర్ పై TMC MP కళ్యాణ్ బెనర్జీ విరుచుకుపడ్డారు. రాజ‌కీయ పార్టీని రాజ‌కీయ పార్టీగానే ఉండనివ్వాల‌ని,  ఒక కాంట్రాక్టర్ ద్వారా రాజకీయ పార్టీని నడపలేరని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయ వ్యూహకర్త, I-PAC అధిప‌తి ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) పై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ కల్యాణ్ బెనర్జీ (MP Kalyan Banerjee) సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీని రాజకీయ పార్టీ లాగానే నడపాలని, రాజ‌కీయ పార్టీని ఓ కాంట్రాక్ట‌ర్ న‌డ‌ప‌లేడని మండిప‌డ్డారు. 

తాను ఎంపీగా ఉన్న ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో అడ్మినిస్ట్రేటర్ల బోర్డు నియామకంపై తన‌ను ఎప్పుడూ సంప్రదించలేదనీ, కానీ I-PAC చాలా మందిని అడ్మినిస్ట్రేటర్ల బోర్డులో నియమించిందనీ, ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం తాను చాలా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాననీ. ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే.

దువారే సర్కార్ (ప్ర‌జ‌ల ముంగిటే ప్ర‌భుత్వం), బంగ్లా నిజేర్ మెయెకీ చాయే (బెంగాల్ త‌న కూతురినే కోరుకుంటోంది) అనే ఆక‌ర్ష‌ణీయ నినాదాల‌తో ప్ర‌శాంత్ కిషోర్ ఎత్తుగ‌డ‌లు TMCకి అనుకూలంగా మారాయని నమ్ముతారు. కిషోర్ చేసిన‌ ఔట్ రీచ్ కార్యక్రమాలు TMC రాష్ట్రవ్యాప్తంగా కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందడంలో, ప్ర‌జ‌ల నుంచి మెరుగైన ఆద‌ర‌ణ ల‌భించేలా దోహ‌ద‌ప‌డ్డాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. 

టీఎంసీని స‌రికొత్త‌గా ప్ర‌జ‌ల ముందుకు చేర్చ‌డంలో ప్ర‌శాంత్ కిషోర్ సూచ‌న‌లతో రూపొందిన కార్య‌క్ర‌మాలు తృణ‌మూల్‌ను తిరిగి బెంగాలీల‌కు చేరువ చేసింద‌ని చెబుతున్నారు. ఇక ప్ర‌శాంత్ కిషోర్‌పై తాజాగా టీఎంసీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌కలం రేపుతున్నాయి.