ఇండోర్: ఆ ముగ్గురు తండ్రీ కొడుకులు. ఓ యువతిని అత్యంత దారుణంగా హత్య చేశారు. నిజం బయటకు రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని కాల్చి బూడిద చేసేశారు. ఓ ప్రదేశంలో కుక్కను చంపేసి పూడ్చిపెట్టారు. ఎవరో మనిషిని పూడ్చిపెట్టారనే పుకారు సృష్టించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు జాగీలాలతో వెళ్లారు. కేసు విచారణ చేపట్టారు. జాగీలాలు వాసన చూసిన చోట తవ్వి చూడగా కుక్క కళేబరం కనిపించింది. కేసును ఇలా రెండేళ్లపాటు తప్పుదోవ పట్టించారు ఆ తండ్రీ తనయులు. 

ఇది చదువుతుంటే మీకు ఏదో సినిమా గుర్తుకు వస్తున్నట్లు అనిపించడం లేదు. అదేనండి దృశ్యం మూవీ. అయితే ఆ సినిమాలో తల్లి కుమార్తెలు కలిసి యువకుడిని హత్య చేస్తారు. ఇండోర్ లో మాత్రం తండ్రీ తనయులు కలిసి యువతిని హత్య చేశారు. 

ఇక వివరాల్లోకి వెళ్తే  ఇండోర్ లో రెండేళ్ల క్రితం 22 ఏళ్ల యంగ్ కాంగ్రెస్ లీడర్ ట్వింకిల్ దాగ్రే అనే మహిళ రెండేళ్ల క్రితం అదృశ్యమైంది. అయితే ఆమె అదృశ్యమైన తీరు పోలీసులకు ఓ సవాల్ గా మారింది. రెండేళ్లపాటు పోలీసులు నానా పాట్లు పడ్డారు. ఎట్టకేలకు నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్లు రెండేళ్లు దాటినా కేసును ఛేదించారు పోలీసులు. 

ఇకపోతే ఇండోర్ కు చెందిన బీజేపీ నేత మాజీ కౌన్సిలర్ 66ఏళ్ల జగదీష్ కరోటియాకు ట్వింకిల్ దాగ్రేకు వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ట్వింకిల్ దాగ్రేతో తన తండ్రి నడుపుతున్న వివాహేతర సంబంధం తెలుసుకున్న తనయులు తండ్రితో వాగ్వాదానికి దిగారు. 

దీంతో తండ్రీ తనయులు మధ్య విబేధాలు తలెత్తాయి. తన కుటుంబంలో కలతలకు ట్వింకిల్ దాగ్రేయే కారణమని ఆమెను అడ్డు తొలగిస్తే సరిపోతుందని జగదీష్ కరోటియా భావించారు. తన ప్లాన్ ను కొడుకులకు చెప్పడంతో వారు కూడా సరే అన్నారు. 

జగదీష్ కరోటియా బుర్రలో తట్టిన ప్లాన్ ను ఎలా అమలు చెయ్యాలనే ఆలోచనలో పడ్డారు తనయులు అజయ్(36), విజయ్(38), వినయ్(31). నలుగురు కలిసి ద్రిశ్యం సినిమా చూశారు. ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్‌ను అప్లై చేసి ట్వింకిల్ దాగ్రేను హత్య చేశారు. అయితే హత్య విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని కాల్చివేశారు. 

ఓ ప్రదేశంలో ఓ కుక్కను చంపేసి పూడ్చి పెట్టారు. ఎవరో మనిషిని పూడ్చిపెట్టారనే పుకార్లు సృష్టించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో పాతిపెట్టింది కుక్క కళేబరం అని తేలింది. ఇలా కేసును రెండేళ్ల పాటు తప్పుదోవ పట్టించారు ఆ ప్రబుద్ధులు. కానీ ఎట్టకేలకు మిస్టరీ వీడింది. 

ట్వింకిల్ దాగ్రేను హత్య చేసి నిప్పంటించిన చోట ఆమెకు సంబంధించిన బ్రాసిలైట్, ఆభరణాల దొరికాయి. వాటి ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మెుత్తం గుట్టు రట్టైంది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.