ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. కరోనా ప్రభావంతో ఆయన న్యూఢిల్లీ నుంచే వర్చువల్‌గా హాజరయ్యారు. సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

గత 8 నెలల నుంచి ప్రపంచం కోవిడ్‌తో పోరాడుతోందని.. సమయానికి అనుకూలంగా సంస్కరణలు ఉండాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. సరికొత్త సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని ప్రధాని చెప్పారు. ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

కోవిడ్‌ వాక్సిన్లను వేగంగా తయారు చేసేందుకు భారత ఫార్మా సిద్ధంగా ఉందని మోడీ తెలిపారు. ఇవాళ ఐక్యరాజ్యసమితి అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని అన్నారు. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులేంటి.. ఇప్పుడు పరిస్థితులేంటి? అని మోదీ ప్రశ్నించారు.

ఈ అంతర్జాతీయ సంస్థలో సంస్కరణల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. 21వ శతాబ్దంలోని సవాళ్లకు అనుగుణంగానే యూఎన్‌లో సంస్కరణలు రావాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో సమూల ప్రక్షాళన జరగాలని ఆకాంక్షిస్తున్నామని నరేంద్రమోడీ పేర్కొన్నారు.