దేశంలోని కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిని, వ్యాక్సిన్ డెలివరీ, పంపిణీ, అధికార యంత్రాంగం సన్నద్దతపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి, హర్ష్ వర్ధన్, ప్రధాని ముఖ్య కార్యదర్శి (ఆరోగ్యం) నీతి ఆయోగ్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సీనియర్ సైంటిస్ట్స్, పిఎంఓ అధికారులు, కేంద్ర ప్రభుత్వ ముఖ్య విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

ఈ భేటీలో రోజువారీ కేసులు, వృద్ధి రేటులో స్థిరమైన తగ్గుదలను అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో మూడు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వాటిలో రెండు ఫేజ్1, ఫేజ్ 2 దశలో ఉన్నాయి. భారతీయ శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధనా బృందాలు పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంకలకు సైతం వ్యాక్సిన్ తయారీలో పరస్పరం సహకరించుకుంటున్నాయి.

ఇప్పటికే బంగ్లాదేశ్, మయన్మార్, ఖతార్, భూటాన్‌లు తమ దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సహకరించాల్సిందిగా భారత్‌ను అభ్యర్ధిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజానికి సాయపడే ప్రయత్నంలో, మన శక్తిసామర్ద్యాలను పొరుగు దేశాలకే పరిమితం చేయవద్దని ప్రధాని పరిశోధనా బృందాన్ని ఆదేశిస్తున్నారు. వ్యాక్సిన్ డెలివరీ, పంపిణీ వ్యవస్థ తదితర సేవలను ప్రపంచమంతా విస్తరించాలని ఆయన సూచించారు.

వ్యాక్సిన్ నిర్వహణ, పంపిణీ తదితర వివరాలతో కూడిన బ్లూప్రింట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత భాగస్వాములతో సంప్రదించాలని కోరారు. నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ నిపుణుల బృందం చురుకుగా పనిచేస్తోందని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్‌ను త్వరగా అందించే చర్యలు చేపట్టాలని నరేంద్రమోడీ ఆదేశించారు. లాజిస్టిక్స్, డెలివరీ విషయంలో అధికార యంత్రాంగం కఠినంగా ఉండాలని మోడీ నొక్కి చెప్పారు.

కోల్డ్ స్టోరేజ్‌ల నిర్వహణపై అధునాతన ప్రణాళిక, పంపిణీ నెట్‌వర్క్, పర్యవేక్షణ విధానం, ముందస్తు అంచనా, సిరంజీలు వంటి ఇతర అనుబంధ పరికరాల తయారీని ముమ్మరం చేయాలని ప్రధాని సూచించారు.

దేశంలో ఎన్నికలు, విపత్తులను విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని మోడీ గుర్తుచేశారు. ఇదే తరహాలో వ్యాక్సిన్ డెలివరీ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలోకి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పౌర సమాజం, వాలంటీర్లు, ఇతరులు స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధాని సూచించారు.

ఈ మొత్తం ప్రక్రియకు బలమైన ఐటీ వ్యవస్థ వెన్నెముకగా ఉండాలన్నారు. ఐసీఎంఆర్, డీబీటీలు కోవిడ్ 19పై దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వైరస్ జన్యుపరంగా స్థిరంగా ఉందని, పెద్దగా మ్యూటేషన్ లేదని తెలిపాయి.

కేసులు తగ్గుతున్నాయని సంతృప్తి పడకుండా ఈ మహమ్మారిని అరికట్టే ప్రయత్నాలను కొనసాగించాలని ప్రధాని సూచించారు. ముఖ్యంగా రాబోయే పండుగ సీజన్‌ నేపథ్యంలో సామాజిక దూరం, మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, పారిశుద్ధ్యం వంటి చర్యలు పాటించాలన్నారు.