బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. బీహార్‌లో అద్భుతమైన విజయాన్ని అందించారని, ఇది ప్రజాస్వామ్య విజయంగా నరేంద్రమోడీ అభివర్ణించారు.

నిన్నంతా ప్రజలు టీవీలు, ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లకు అతుక్కుపోయారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారని ఆయన అన్నారు. రిజల్ట్ తర్వాత రోజు.. మీడియాలో వచ్చే కథనాలు ఏంటంటే, బూతుల రిగ్గింగ్, ఓట్ల గల్లంతేనని మోడీ చెప్పారు.

ఇప్పుడు సీన్ మారిందని.. ఒటింగ్ శాతం ఎంత పెరిగిందనేది హెడ్‌లైన్ అవుతోందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామేనని.. దీంతో భారత్ సత్తా ఏంటో ఎన్నికల కమీషన్ ప్రపంచానికి చాటి చెప్పిందని మోడీ వ్యాఖ్యానించారు.

నిన్నటి ఉప ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్‌ను నిర్దేశించేవని, బీజేపీ సౌత్‌లో లేదన్న వారికి ఈ ఫలితాలు షాకిచ్చాయన్నారు. కర్ణాటక, తెలంగాణలలో బీజేపీ సత్తా చాటిందని... పనిచేస్తూ వుంటే ప్రజలే ఆశీర్వదిస్తూ ఉంటారని ప్రధాని అభిప్రాయపడ్డారు.