Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై కేంద్రంపై అప్రమత్తం.. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం..

చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈరోజు మధ్యాహ్నం దేశంలో  కోవిడ్-19కి సంబంధించిన పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. 
 

PM Modi to review Covid related situation in country at high level meeting today
Author
First Published Dec 22, 2022, 10:05 AM IST

చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే దేశంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విదేశాల్లో  కరోనా కేసులు పెరుగుతుండటం, కొత్త వేరియంట్ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ నేతృత్వంలో నేడు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో దేశంలో కోవిడ్-19కి సంబంధించిన పరిస్థితిని, సంబంధిత అంశాలను ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. 

ఇదిలా ఉంటే.. చైనాతో కరోనా కేసులు పెరుగుదలకు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్ 7‌‌ భారత్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ రకానికి చెందిన మూడు కేసులు భారత్‌లో నమోదయ్యాయ్యని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 అనేది  వేరియంట్ BA.5 ఉప వంశం. ఇది అత్యంత వేగంగా సంక్రమించే స్వభావం కలిగి ఉంది. టీకాలు వేసిన వారికి కూడా ఇన్‌ఫెక్షన్ కలిగించే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇక, భారతదేశంలో మొదటి BF.7 కేసును అక్టోబర్‌లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. ఇప్పటివరకు గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒక కేసు నమోదైందని ఆ వర్గాలు తెలిపాయి. 

ఇక, ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడూ గుర్తించేందుకు పాజిటివ్ నమునాలను పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. 

మన్సుఖ్ మాండవీయా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. భారతదేశంలో అర్హతగల జనాభాలో కేవలం 27 నుంచి 28 శాతం మంది మాత్రమే కోవిడ్ బూస్టర్ డోస్‌ తీసుకున్నారని అన్నారు. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. ‘‘ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు తప్పకుండా ఈ నిబంధన పాటించాలి’’ అని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ‘‘కొన్ని దేశాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా, నేను ఈరోజు నిపుణులు, అధికారులతో పరిస్థితిని సమీక్షించాను. కోవిడ్ ఇంకా ముగియలేదు. నేను అప్రమత్తంగా ఉండాలని మరియు నిఘాను పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులందరికీ సూచించాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికకైనా మేము సిద్ధంగా ఉన్నాము’’ అని మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. ఇక, చైనా, ఇతర దేశాల నుంచి వచ్చేవారిలో కొందరని విమానాశ్రయాలలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసి నమూనాలను పరీక్షలు పరీక్షించనున్నట్టుగా అధికారిక వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios