Women Reservation Bill| 140 కోట్ల భారతీయలకు అభినందనలు : ప్రధాని మోడీ
Women Reservation Bill:రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో 215 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. మహిళా సాధికారత కోసం అన్ని రాజకీయ పార్టీలు శక్తికి మద్దతిచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత దానికి మద్దతుగా ఓటు వేసిన ఎంపీలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Women Reservation Bill: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నాలుగో రోజు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్లపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో ఎంపీలంతా ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు పలికారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 214 ఓట్లు పోలయ్యాయి. ఎవరూ కూడా అభ్యంతరం చెప్పలేదు. బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత మహిళా ఎంపీలంతా పార్లమెంట్ గేటు వద్ద నిలబడి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో.. చాలా మంది ఎంపీలు ప్రధాని మోడీకి పుష్పగుచ్ఛాలు, శాలువాలు కప్పి హర్షం వ్యక్తం చేశారు. పిఎం మోడీ కూడా అందరితో సెల్ఫీ తీసుకున్నారు.
ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'మన దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో కీలక ఘట్టం. దేశ చరిత్రలో అనిర్వచనీయం పరిణామం. 140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు. నారీ శక్తి వందన్ చట్టానికి ఓటు వేసిన రాజ్యసభ ఎంపీలందరికీ ధన్యవాదాలు. ఇటువంటి ఏకగ్రీవ మద్దతు నిజంగా హర్షణీయం. పార్లమెంటులో నారీ శక్తి బంధన్ చట్టం ఆమోదించడంతో భారతదేశంలోని మహిళలకు బలమైన ప్రాతినిధ్యం, సాధికారత యుగం ప్రారంభమైంది. ఇది కేవలం చట్టం కాదు. ఇది మన దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న అసంఖ్యాక మహిళలకు నివాళి. వారి దృఢత్వం, సహకారంతో భారతదేశం సుసంపన్నమైంది. మన దేశంలోని మహిళలందరి శక్తి, ధైర్యం, స్ఫూర్తిని మనం గుర్తుచేసుకుంటాము. ఈ చారిత్రాత్మక అడుగు వారి గొంతులను మరింత ప్రభావవంతంగా వినిపించేలా సహకరిస్తుంది' అని ప్రధాని మోడీ అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్‌సభ ఆమోదించింది. లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు పోలయ్యాయి. ఏఐఎంఐఎం ఎంపీలు వ్యతిరేకంగా 2 ఓట్లు వేశారు. ఆ తర్వాత .. గురువారం రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు. వారి ఆమోదం లభించిన వెంటనే ఇది చట్టంగా మారుతుంది. చట్టం చేసిన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలైతే పార్లమెంటు, దేశంలోని అన్ని అసెంబ్లీలలో మహిళల సంఖ్య 33 శాతానికి పెరుగుతుంది.
ఈ బిల్లులో ఏముంది?
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ , రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం లేదా మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించవచ్చు.
ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత అది చట్టంగా మారుతుంది. అయితే ఈ చట్టం చేసిన తర్వాత కూడా అమలుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాతే ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ల ప్రయోజనం దక్కనుంది. అయితే దేశంలో ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.
వాస్తవానికి, దేశంలో జనాభా గణనను 2021లోనే నిర్వహించాల్సి ఉంది, అది ఇప్పటి వరకు జరగలేదు. ఈ జనాభా గణన ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారం లేదు. 2027 లేదా 2028 అని ఎక్కడో వార్తల్లో చెప్పబడింది. ఈ జనాభా గణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన లేదా పునర్నిర్వచనం జరుగుతుందని, అప్పుడే మహిళలకు రిజర్వేషన్లు లభిస్తాయన్నారు.
27 ఏళ్లుగా బిల్లు పెండింగ్
దాదాపు 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి టేబుల్‌పైకి వచ్చింది. ప్రస్తుత లెక్కల ప్రకారం లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 15 శాతం కంటే తక్కువగా ఉండగా, రాష్ట్ర అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం 10 శాతం కంటే తక్కువగా ఉంది. 2010లో ఈ అంశంపై చివరిసారిగా చర్య తీసుకోబడింది, అయితే గందరగోళం మధ్య రాజ్యసభ బిల్లును ఆమోదించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన కొంతమంది ఎంపీలను మార్షల్స్ తొలగించారు.