ప్రధాని నరేంద్రమోదీకి వచ్చిన కానుకలకు వేలం నిర్వహించారు. కాగా... ఈ వేలంలో ఆ కానుకులు రూ.కోట్లు పలికాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రధాని మోదీకి వెండి కలశాన్ని కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కలశం వేలంలో రూ.కోటి పైనే పలికింది. మోదీ చిత్రంతో ఉన్న ఫోటో స్టాండ్ కూడా రూ.కోటి అమ్ముడుపోయింది. 

దేశ, విదేశాల పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీకి వచ్చిన అన్ని కానుకలను ఆన్ లైన్ ద్వారా  వేలం వేశారు. ఈ వేలం సెప్టెంబర్ 16తో ముగిసింది. కాగా... ఈ వేలంలో కలశం, ఫోటో స్టాండ్.. రెండూ చేరో కోటి రూపాయలు పలికాయి. కలశం అసలు ధర రూ.18వేలు, ఫోటో స్టాండ్ ధర రూ.500 కావడం గమనార్హం.

నమామి గంగే’ ప్రాజెక్టు కోసం నిధుల సేకరణలో భాగంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న కానుకలకు ఈ వేలం నిర్వహించారు. బహుమతుల ప్రదర్శన, వేలం పాటను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ శనివారం ప్రారంభించారు. శాలువాలు, తలపాగాలు, జాకెట్లు సహా 2,700కుపైగా వస్తువులు ప్రదర్శనలో ఉంచారు.