అటల్ టన్నెల్ ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మనాలి–లేహ్‌ ల మధ్య 46 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా దాదాపుగా 4 నుండి 5 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. 


9.02 కిలోమీటర్ల పొడవుతో హైవే పై నిర్మించిన ప్రపంచంలోని అతి పెద్ద టన్నెల్ గా అటల్ టన్నెల్ చరిత్ర సృష్టించింది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇది అత్యంత కీలకమైనది. మనాలి నుంచి లహుల్ స్పితి లోయలకు సంవత్సరం పొడవునా ఇది రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది.

 

గతంలో సంవత్సరంలో ఆరు నెలలపాటు మంచు కారణంగా ఈ మార్గం మూసుకుపోయి ఉండేది. ఇప్పుడు ఈ టన్నెల్ వల్ల సంవత్సరం పొడవునా ప్రయాణ సౌలభ్యం ఉంటుంది.  

ప్రధానిగా అటల్ బిహారి వాజపేయి ఉన్నప్పుడు ఈ టన్నెల్ ని నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. దీనిని నిర్మిస్తున్న సమయంలో రోహతంగ్ టన్నెల్ అని పిలిచేవారు. అటల్ బిహారి వాజపేయి మరణానంతరం, మోడీ సర్కారు దీనికి అటల్ టన్నెల్ అని నామకరణం చేసింది.  

ఈ సొరంగ మార్గాన్ని అత్యాధునికమైన సదుపాయాలతో నిర్మించారు. పీర్ పంజాల్ శ్రేణుల్లో సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఈ 9.02 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మించారు. దక్షణ ద్వారం మనాలి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటె.... ఉత్తర ద్వారం సిస్సు గ్రామానికి దగ్గర్లో ఉంది. 

గుర్రపు నాడ ఆకారంలో ఉండే ఈ టన్నెల్ 8 మీటర్ల వెడల్పు తో డబల్ లేన్ లో నిర్మించబడింది. ప్రతిరోజు 3000 కార్లు, 1500 ట్రక్కులు ప్రయాణించేందుకు వీలుగా ఈ టన్నెల్ ని నిర్మించారు. ఇందులో వాహనాలు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 

అత్యాధునికమైన అగ్నిమాపక వ్యవస్థ, గాలి వెలుతురు కోసం వెంటిలేషన్ వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డాయి. దాదాపు 3,300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ టన్నెల్ ని నిర్మించారు. ఇందులో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యాన్ని, ప్రతి 60 మీటర్లకు అగ్నిమాపక సిలిండర్లను, ప్రతి 500 మీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేసినట్టు తెలియవస్తుంది.