న్యూఢిల్లీ: ప్రధాని మోడీని తాను కొడుకుగా భావిస్తానని బిల్కిన్ దాదీ చెప్పారు. ఆయన ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్లి కలుస్తానని ఆమె ప్రకటించారు.

ఈ ఏడాది టైమ్ మేగజైన్ లో బిల్కిన్ కు చోటు దక్కింది. అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో మోడీ సహా ఐదుగురు భారతీయులకు చోటు దక్కింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్ బాగ్ ఆందోళనలను బిల్కిన్  దాదీ ముందుండి నడిపారు.దీంతో ఆమెకు షాహీన్ బాగ్ దాదీగా పేరుంది. 

వంద రోజుల పాటు బిల్కిన్ పౌరసత్వచట్ట సవరణానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించారు.  ఒకచేత్తో జపమాల, మరో చేత్తో జాతీయ జెండా పట్టుకొని ఆమె పోరాటం చేశారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి వరకు ఆమె నిరసనల్లో పాల్గొనేవారు.

ఈ విషయమై ఓ జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. మోడీ పిలిస్తే తప్పకుండా వెళ్తానని ఆమె ప్రకటించారు. భయపడాల్సిన అవసరం ఏముంది... మోడీ కూడ తన కొడుకు లాంటి వాడేనని ఆమె అభిప్రాయపడ్డారు.