కరోనా వైరస్ కారణంగా మూతపడిన ఆధ్యాత్మిక కేంద్రాలు తెరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.  దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనుసరించాల్సిన నిబంధనలను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తాజాగా ప్రార్థనామందిరాలపై ప్రకటన చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే ఆ కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యనే ఉందని, మాస్కులు తప్పకుండా ధరించాలని సీఎం ప్రజలను అప్రమత్తం చేశారు.  ప్రస్తుతం వైరస్ నెమ్మదించినట్లు కనిపించినా..ఉదాసీనత వద్దు.. ప్రజలు క్రమశిక్షణతో మెలగాలని ఉద్ధవ్ సూచించారు.

హోలి, గణేశ్ చతుర్థి, నవరాత్రులు, ఇతర పర్వదినాలను క్రమశిక్షణతో జరుపుకొన్నట్లే, ఇప్పుడు కూడా నిబంధనలను మదిలో ఉంచుకోవాలి అని థాక్రే హితవు పలికారు.

మహమ్మారి కారణంగా ఆలయాలు మూసివేసి ఉన్నప్పటికీ, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రూపంలో ఆ భగవంతుడు తన ప్రజలను జాగ్రత్తగా చూసుకున్నాడంటూ ముఖ్యమంత్రి వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. క్రమశిక్షణ చర్యలు పాటిస్తే..మనకు దేవుడికి ఆశీర్వాదాలు అందుతాయన్నారు.   

కాగా, మార్చి నుంచి మూసి ఉన్న దేవాలయాలు తెరవాలన్న విజ్ఞప్తులు పెరిగిపోవడంతో పాటు, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని అర్చకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బీజేపీ నేతలు సైతం ఆలయాలు తెరిచేందుకు అనుమతివ్వాలంటూ ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. వీటన్నింటి మధ్య  దీపావళి తరవాత ప్రార్థనా మందిరాలకు అనుమతిస్తామంటూ గతవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ వెల్లడించారు.

వాటితో పాటు పాఠశాలలు పునః ప్రారంభించేందుకు ఆయన సానుకూలతను వ్యక్తం చేశారు. దీపావళి తరవాత నిబంధనలను సిద్ధం చేస్తామని.. వయసుపైబడిన వారు దేవాలయాలకు వస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్న ఆయన ఏ ప్రార్థనా స్థలమైనా సరే రద్దీని నివారించాల్సి ఉందని థాక్రే వెల్లడించారు. అలాగే మాస్కులు ధరించకుండా వచ్చే వారిపై జరిమానా విధిస్తామని కూడా సీఎం హెచ్చరించారు.

కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని వాటిని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.  ఒక కొవిడ్ బాధితుడు మాస్క్ ధరించకుండా ఉంటే.. అతని వల్ల 400 మందికి వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.