ఫ్లైట్ గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం.. ‘డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలని..’
ఫ్లైట్ గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసిన ప్రయాణికుడు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. అందుకే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టు అంగీకరించాడని వివరించారు. ఈ రోజు ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్టు చెప్పారు.

న్యూఢిల్లీ: ఇటీవల ఓ ప్రయాణికుడు ఫ్లైట్ గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయాలని ప్రయత్నించాడు. ఇది గమనించిన ఇతర ప్రయాణికులు షాక్ తిన్నారు. సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారితోనూ గొడవ పెట్టుకున్నాడు. చివరికి సిబ్బంది విజయవంతంగా ఆయనను నిలువరించడంతో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. తాజాగా, పోలీసుల దర్యాప్తు నిందితుడు ఇలా ఎందుకు చేశాడో వివరించాడు. ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఫ్లైట్‌లో నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు పోలీసులకు వివరించాడు.
వెస్ట్ త్రిపురాలోని జిరానియాకు చెందిన 41 ఏళ్ల బిశ్వజిత్ దేబాత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో వేసిన నేరం కింద అరెస్టు చేశారు. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు క్రూ సిబ్బందితోనూ గొడవకు దిగాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయని అగర్తలాలో ఎయిర్‌పోర్ట్ పోలీసు స్టేషన్ బాధ్యుడైన అభిజిత్ మండల్ వెల్లడించారు. ఈ రోజు బిశ్వజిత్ దేబాత్‌ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామనితెలిపారు.
‘బిశ్వజిత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు అంగీకరించాడు. ఫ్లైట్ గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుం దామని భావించినట్టు చెప్పాడు’ అని పోలీసు అధికారి వివరించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
గురువారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో బిశ్వజిత్ దేబాత్ ఈ ప్రయత్నం చేశాడు. మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్‌పోర్టు రన్ వేకు 15 మైళ్ల దూరంలో ఉండగానే ఈ ప్రయత్నం చేసినట్టు ఓ అధికారి తెలిపారు. దీంతో ఆయనను క్రూ సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. తద్వార ఫ్లైట్ అగర్తలాలో సేఫ్‌గా ల్యాండ్ అయిందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి వివరించారు.
ఈ ఘటన పై విమానంలో ప్రయాణిస్తున్న వారు ఆందోళనలు వ్యక్తం చేశారు.