1991లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనకు పాకిస్థాన్, ఉగ్రవాదమే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ సినిమాపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దీనిని ఈ విమర్శిస్తుండగా.. మరి కొందరు ప్రశంసిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ ఈ సినిమాలో ఉన్న అంశాలపై మాట్లాడారు.
1990లో కాశ్మీరీ పండిట్ల వలసలను ప్రస్తావిస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఆ సమయంలో జరిగిన దానికి పాకిస్తాన్, ఉగ్రవాదమే కారణం అని తెలిపారు. “ మహాత్మా గాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది అని నేను నమ్ముతున్నాను. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దానికి పాకిస్తాన్, మిలిటెన్సీ బాధ్యత వహిస్తుంది. ఇది హిందువులు, కాశ్మీరీ పండిట్లు, కాశ్మీరీ ముస్లింలు, డోగ్రాలు అందరినీ ప్రభావితం చేసింది ” అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మార్చి 11వ తేదీన విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా 1990లో కాశ్మీర్ నుండి వలస వెళ్లిన పండిట్‌లు, పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల అతి కిరాతక చర్యలు వంటివి ఆధారంగా చేసుకొని చేసుకొని రూపొందించారు. అగ్నిహోత్రి రచన, దర్శకత్వం వహించి, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది.
దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకర్శిస్తోంది. ఈ సినిమాకు హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను మినహాయించారు. ఇదిలా ఉండగా.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ద్వారా ప్రభుత్వం సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేయాలని చూస్తోందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. భారతదేశం సినిమాల ద్వారా కాకుండా ప్రభుత్వ విధానం, పాలన ద్వారా నడుస్తుందని అన్నారు. “ సినిమాలు చూసి, చూపించి, సమాజంలో విద్వేషాలు, చీలికలు వ్యాప్తి చేయడం వల్ల జీవితం నడవదు. మన కాశ్మీరీ పండిట్‌లకు ఎప్పుడు పునరావాసం కల్పిస్తారో మోదీజీ చెప్పాలి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వం ఉన్నందున ఒక తేదీ కచ్చితంగా చెప్పాలి.’’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు.
ఈ సినిమాను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇలాంటి సినిమాలు నిజాన్ని బయటపెడతాయని, దానిని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రచారం జరుగుతోందని అన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. సినిమాలను విమర్శించే వారిపై విరుచుకుపడిన ప్రధాని, ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన సత్యాన్ని ఇది ఎత్తి చూపుతోందని అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ అంటూ ఎప్పుడూ జెండా ఎగురవేసే వ్యక్తులు ఐదారు రోజులుగా ఉద్యమిస్తున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా శనివారం ఈ సినిమాపై కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పండిత్ లు, ముస్లింల మధ్య ఉన్న అంతర్యాన్ని తగ్గించేందుకు మేము ప్రయత్నిస్తున్నామనీ, కానీ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తమ ప్రయత్నాన్ని విఫలం చేసిందని తెలిపారు. పండిత్ లు వలస వెళ్లినప్పుడు కేంద్రంలో బీజేపీ మద్దతుతో నడిచే ప్రభుత్వమే ఉందని చెప్పారు.
