స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలంటూ ఓ పాకిస్తానీ డిమాండ్ చేయడం గమనార్హం. పాకిస్తాన్‌కి చెందిన ఓ సంస్థ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ నెల 28న భగత్ సింగ్ 112వ జయంతి సందర్భంగా ఆయనకు మరణానంతర భారత రత్న ప్రకటించాలని భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ కోరింది. 

ఈ మేరకు పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌ గౌరవ్ అహ్లూవాలియాకు ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ ఓ లేఖను అందజేశారు. ‘‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌ సింగ్‌కు మోదీ ప్రభుత్వం అత్యంత గౌరవం ఇస్తోంది. భగత్ సింగ్ అమరత్వం పొందిన రోజును పురస్కరించుకుని 2015 మార్చి 23న ప్రధాని మోదీ పంజాబ్‌(భారత్) లోని ఫిరోజ్‌పూర్‌కు కూడా వెళ్లారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా మోదీ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించాలని మేము కోరుతున్నాం..’’ అని రషీద్ తన లేఖలో పేర్కొన్నారు.
 
బ్రిటీష్ పోలీస్ అధికారి జాన్ శాండర్స్ హత్య వెనుక భగత్ సింగ్ పాత్ర లేదని నిరూపించేందుకు రషీద్ ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తున్నారు. భగత్ సింగ్ ‘‘అమాయకుడు’’ అని నిరూపించేందుకు శాండర్స్ హత్య కేసును మళ్లీ తెరవాలంటూ ఆయన లాహోర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో భగత్ సింగ్ పేరు లేనేలేదని ఆయన పేర్కొన్నారు.