మంకీపాక్స్ కలవరపెడుతోంది. రోజు రోజుకు ఈ వైరస్ సోకిన దేశాల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు మంకీపాక్స్ వైరస్ వెలుగులోకి వచ్చిన దేశాలు 17 వరకు ఉండగా మరో రెండు దేశాలు కూడా ఈ జాబితాలో చేరాయి. ఈఏయూ, చెక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా ఈ వైరస్ ను గుర్తించారు.
మంకీపాక్స్ వ్యాప్తి సాధారణమైంది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఇది తక్కువ స్థాయిలోనే వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పింది. దీనిని నియంత్రించవచ్చని పేర్కొంది. పలు దేశాల్లో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ మరి కొన్ని దేశాలకు వ్యాపిస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), చెక్ రిపబ్లిక్‌లో మంగళవారం మొదటి కేసులను గుర్తించారు. పశ్చిమ ఆఫ్రికా నుండి ప్రయాణించి యూఏఈకి వచ్చిన ఓ మహిళలో, బెల్జియంలో ఒక పండుగలో పాల్గొని చెక్ రిపబ్లిక్ కు వచ్చిన మరో మహిళలో దీనిని గుర్తించారు.
చెక్ రిపబ్లిక్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (SZU) సంస్థ పరీక్షించిన ముగ్గురిలో ఒకరి నమూనా మంకీపాక్స్ వ్యాధికి సానుకూలంగా ఉందని, అయితే తుది పరీక్ష ఫలితాలు వచ్చే వారం నిర్దారణ అవుతాయని తెలిపింది. ఇప్పుడు ఈ వైరస్ నిర్ధారణ అయిన మహిళ మే ప్రారంభంలో ఆంట్‌వెర్ప్‌లో జరిగిన సంగీత ఉత్సవానికి హాజరైంది. ఆమె తిరిగి స్వదేశానికి వచ్చిన తరువాత మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని రాయిటర్స్ తెలిపింది.
అయితే UAEలో వైరస్ సోకిన మహిళ గురించి చాలా తక్కువ వివరాలు వెల్లడించింది. కాగా అధికారులు ఆమె కాంటాక్ట్ లను పరిశోధిస్తున్నారని, మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని నొక్కి చెప్పింది. ఈ కేసును ఎక్కడ కనుగొన్నారనే విషయాన్ని కూడా వారు తెలియజేయలేదు.
ప్రపంచ వ్యాప్తంగా మే నెల ప్రారంభం నుంచి 19 దేశాలలో దాదాపు 237 అనుమానిత, నిర్ధారణ అయిన ఈ మంకీపాక్స్ కేసులను అధికారులు కనుగొన్నారు. అయితే ఇందులో ఎక్కవ భాగం ఐరోపాలోనే గుర్తించారు. కాగా ఇలా మొదటిసారిగా ఈ వైరస్ ఆఫ్రికాకు వెళ్లని వ్యక్తులలో వ్యాప్తి చెందుతోంది. అయితే సాధారణ జనాభాకు ఈ వైరస్ ప్రమాదం తక్కువగా ఉందని, SARS-COV-2 అంత స్పీడ్ గా వ్యాప్తి చెందే అవకాశం లేదని చెబుతున్నారు. కాబట్టి ఇది కోవిడ్ -19 వంటి మహమ్మారిగా వ్యాపించే ఛాన్స్ లేదని చెబుతున్నారు.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా వెలుపల మంకీపాక్స్ కేసుల వ్యాప్తిని అరికట్టవచ్చని మంగళవారం తెలిపింది. ‘‘ ట్రాన్స్ మిషన్ స్థాయిలు ఎక్కడ ఉన్నాయో చూడటానికి, అది ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోవడానికి మంకీపాక్స్ నిఘాను పెంచలాని మేము అందరినీ కోరుతున్నాం ’’ అని
గ్లోబల్ ఇన్ఫెక్షియస్ హజార్డ్ ప్రిపేర్డ్‌నెస్ కోసం WHO డైరెక్టర్ సిల్వీ బ్రయాండ్ తెలిపారు. ఇది సాధారణమైన వ్యాప్తి కాదు అని పేర్కొంటూ దీనిని నియంత్రించవచ్చని తెలిపింది. మంకీపాక్స్ వైరస్ కు టీకాలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని బ్రయాండ్ వివరించారు. తగిన నియంత్రణ చర్యలు, మరిన్ని పరిశోధనల కోసం ప్రపంచ సహకారం అందించాలని కోరారు.
మంకీపాక్స్ వైరస్ అంటే ఏమిటి?
మంకీపాక్స్ అనేది ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువులలో ఉద్భవించే వైరస్. అప్పుడప్పుడు మనుషులకు సోకుంతుంది. ఇది మశూచి మాదిరిగానే అదే కుటుంబానికి చెందినది. 1958లో పరిశోధనా కోతులలో పాక్స్ లాంటి వ్యాధి విజృంభించినప్పుడు శాస్త్రవేత్తలు దీనిని మొట్టమొదట గుర్తించారు. అందుకే దీనికి కోతులకు సంబంధించిన పేరు వచ్చింది. 1970లో కాంగోలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక యువకుడికి మొదటిసారిగా సోకింది.
