UP Assembly Election 2022: ఒపీనియన్ పోల్స్‌ను స‌మాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి అనుకూలమైన సర్వేలు స‌రియైన‌వి కాద‌నీ, అవి ఒపీనియన్ పోల్స్ కాదని, ఓపియమ్ (మత్తు) పోల్స్ అని విమ‌ర్శించారు అఖిలేష్ యాదవ్. 

UP Assembly Election 2022: ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న కొద్దీ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. అధికార, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు మ‌ధ్య ప‌ర‌స్ప‌రం మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సారి అధికారం చేప‌ట్ట‌బోయేది తామంటే తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోన్నాయి. ఈ క్రమంలో ఓట‌ర్ల‌కు ఆక‌ర్షించ‌డానికి వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నాయి ప్ర‌ధాన పార్టీలు. తాము అధికారంలోకి వ‌స్తే ఇది చేస్తాం, అది చేస్తామంటూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు. 

ఇదిలా ఉండ‌గా.. యూపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నే విష‌యంలో ప‌లు సంస్థ‌లు ఒపినీయ‌న్ పోల్స్ నిర్వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలో చాలా ఒపినీయ‌న్ పోల్స్ అధికార బీజేపీకి స‌పోర్టు చేస్తూ.. వెల్ల‌డ‌వుతున్నాయి. ఈ ఒపీనియన్ పోల్స్ పట్ల ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేఖిస్తున్నాయి. వెంటనే సర్వే ప్రసారాలను నిషేధించాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ)ను డిమాండ్ చేశాయి. వచ్చే నెలలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలు కానుండడం తెలిసిందే. 

 స‌మాజ్ వాదీ పార్టీ సైతం ఈ ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. త‌క్ష‌ణ‌మే.. 
 వార్తా ఛానళ్లలో ప్రసారమయ్యే ఒపీనియన్ పోల్స్‌ను నిలిపివేయాల‌ని సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికలను ప్రసారం చేయడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనని, అవి ఓటర్లను తప్పుదారి పట్టించి ఎన్నికలను ప్రభావితం చేయగలవని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో పార్టీ పేర్కొంది.

ఒపీనియన్ పోల్స్‌పై స‌మాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అనుకూలమైన సర్వేలు స‌రియైన‌వి కాద‌నీ, అవి ఒపీనియన్ పోల్స్ కాదని, ఓపియమ్ (మత్తు) పోల్స్ అని విమ‌ర్శించారు అఖిలేష్ యాదవ్.

వచ్చే నెలలో యూపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొన్ని టీవీ ఛానళ్లలో చూపిన ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఒత్తిడి చేశారు. "ఇవి ఒపీనియన్ పోల్స్ కాదు. ఓపియం పోల్స్ అని ఎద్దేవా చేశారు. ఈ సర్వేలు ఏ ప్రాతిపదికన చేశారో.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు.

 బీజేపీ హయంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రికార్డు స్థాయిలో న‌మోదైంద‌ని, ప్రజల కోపం కారణంగా వారి అభ్యర్థులను నియోజకవర్గాల నుండి తరిమికొడుతున్నారని విమ‌ర్శించారు. ఈ కారణంతో బీజేపీ ప్రచారం చేయలేకపోయిందని, వర్చువల్ ర్యాలీలకు సిద్ధమైందని ఆయన అన్నారు. అందుకే.. బీజేపీ నేత‌లు.. డిజిట‌ల్ ప్ర‌చారం కోసం ముంద‌స్తుగా.. స్టూడియోలను సిద్ధంగా చేసుకున్నాయ‌నీ, ఎన్నికల సంఘం ర్యాలీలను నిషేధిస్తుందని వారికి ముందే తెలుసా? అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.


మెజారిటీ ఒపీనియన్ పోల్స్ బీజేపీకే అధికారం తిరిగి దక్కుతుందని, ఎస్పీ గతంతో పోలిస్తే బలం పుంజుకుంటుందని వెల్లడించాయి. బీజేపీ ఆధిపత్యం కొంత తగ్గొచ్చని అంచనా వేశాయి. దీంతో ఈ తరహా ప్రసారాలు, ప్రచారం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయని ఎస్పీ ఆందోళన చెందింది. ఈ విషయమై ఈసీకి లేఖ రాసింది.