Asianet News TeluguAsianet News Telugu

గాంధీల మద్దతు లేదు!.. దళిత నేతగానే కాదు, కాంగ్రెస్ నాయకుడిగా బరిలోకి దిగా.. : మల్లికార్జున్ ఖర్గే

మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. తనకు గాంధీల మద్దతు ఉన్నదనే వాదనలను కొట్టిపారేశారు. ఈ ఎన్నికలో తాను కేవలం దళిత నేతగానే కాదు.. ఒక కాంగ్రెస్ నేతగా బరిలోకి దిగుతున్నానను అని అన్నారు. శశిథరూర్ పై వ్యాఖ్యలు సహా పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు.

not solely contesting as a dalit leader but as a congress leader says mallikarjun kharge
Author
First Published Oct 2, 2022, 2:54 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఇద్దరు ప్రత్యర్థులు ఖరారు అయ్యారు. ఒకరు శశిథరూర్, మరొకరు మల్లికార్జున్ ఖర్గే. శశిథరూర్ రెబల్ గ్రూప్ నేత అయితే.. గాంధీ కుటుంబం నిర్ణయించిన అభ్యర్థిగా మల్లికార్జున్ అని చాలా మంది భావిస్తున్నారు. మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు తన ప్రచార క్యాంపెయిన్ ప్రారంభించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాలను ఆయన వెల్లడించారు.

‘ఒక వ్యక్తికి, ఒక పోస్టు అనే నిబంధనను శిరసావహిస్తూ నామినేషన్ వేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశాను. మహాత్మా గాంధీ జయంతి నాడు నా క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నాను. పార్టీ నేతలు, కార్యకర్తలే నన్ను అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగాలని కోరారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు పోటీ చేయడం లేదని నా సహచరులు చెప్పారు’ అని ఆయన వివరించారు. గాంధీ కుటుంబం సూచనల మేరకే ఖర్గే బరిలోకి దిగారనే ఆరోపణలను కొట్టిపారేశారు. తనకు గాంధీల మద్దతేమీ లేదని వివరించారు. పార్టీ నేతలు, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు పోటీ చేస్తున్నారని చెప్పారు.

‘నా బాల్యమంతా ఎన్నో సంఘర్షణలతో నిండి ఉన్నది. భావజాలం, విలువల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. ప్రతిపక్ష నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా చాలా ఏళ్లు చేశాను. ఇప్పుడు మరోసారి పోరాడాలనుకుంటున్నాను. అవే విలువలు, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ భావజాలరం, బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగం విలువలను ముందుకు తీసుకెళ్లడానికే ఎన్నికలో పోటీ చేస్తున్నాను. నాకు పార్టీ ప్రతినిధులు, విభాగాల సభ్యులు అందరి మద్దతు కావాలి’ అని వివరించారు.

‘నేను కేవలం ఒక దళిత నేతగా మాత్రమే పోటీ చేయడం లేదు. ఒక కాంగ్రెస్ నేతగా పోటీ చేస్తున్నాను. ఇకపైనా అదే వైఖరి కొనసాగిస్తా’ అని స్పష్టం చేశారు. బీజేపీ పై విమర్శలు చేస్తూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తాండవిస్తున్నాయని తెలిపారు. బీజేపీ ఇచ్చిన వాగ్ధానాలన్నీ అలాగే ఉండిపోయాయని, ఏ హామీని పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు.

మార్పు కావాలంటే తనకు ఓటు వేయాలని, యథాతథ స్థితి కొనసాగాలంటే ఖర్గేకు ఓటు వేయాలని శశిథరూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖర్గే ముందు ప్రస్తావించగా.. ‘ఎన్నికల తర్వాత పార్టీలో ఎలాంటి సంస్కరణ చేపట్టినా.. అందరూ కలిసి సంయుక్తంగా చేపట్టాల్సిందే.. ఒక్కరి చేతిలో ఏమీ ఉండదు’ అని వివరించారు. నిజానికి తాను శశిథరూర్‌తో మాట్లాడానని పేర్కొన్నారు. పార్టీ చీఫ్‌ కోసం అందరికీ ఆమోద యోగ్యమైన అభ్యర్థిని ఎంచుకోవడం సముచితం అని తాను శశిథరూర్‌కు ముందే చెప్పానని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios