ఆర్ధిక శాస్త్రంలో పరిశోధనలకు గాను నోబెల్ బహుమతిని అందుకుని భారతీయులను గర్వపడేలా చేశారు అభిజిత్ బెనర్జీ. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసినందుకు గాను నోబెల్ కమిటీ ఆయనను ఎంపిక చేసింది.

శాస్త్రవేత్తలంటే ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉంటారని, ల్యాబ్‌ల్లో గడుపుతారని అందరికి తెలిసింది. అయితే అభిజిత్ బెనర్జీని భారత్‌లోనే అత్యంత భయంకరమైన కారాగారం తీహార్ జైలులో ఉంచారట.

తీవ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులను ఉంచే అలాంటి జైలులో ఉంచడానికి ఆయనేం పెద్ద నేరం చేయలేదు. విద్యార్ధి సంఘం నాయకుడికి మద్ధతుగా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను అభిజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలులో ఉంచారు.

10 రోజుల పాటు తమను కొట్టడమే కాకుండా రాజద్రోహం, హత్యానేరం కింద కేసులు నమోదు చేశారని అభిజిత్ బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తమ నిరసన వల్ల పరిపాలనలో మంచి మార్పులు వచ్చాయని అభిజిత్ నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

1961లో కోల్‌కతాకు చెందిన ఆర్ధిక వేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు ఆయన జన్మించారు. విద్యాభ్యాసం అంతా భారతదేశంలోనే సాగింది. ఆర్ధిక సంవత్సరంలో ప్రయోగాలకు గాను అమెరికన్ శాస్త్రవేత్త మైఖేల్ క్రెమెర్‌తో పాటు అభిజిత్ ఆయన భార్య ఎస్తర్ డఫ్లో నోబెల్ బహుమతికి ఎంపికైన సంగతి తెలిసిందే.