Karnataka Hijab Row:  హిజాబ్‌ను ముస్లిం మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారని, దానిని ఎవరూ ఇష్టపడి ధరించరని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ట్రిపుల్ తలాక్‌‌ను ఎవరైనా ఇష్టపడి అంగీకరించారా? అని ప్రశ్నించారు. ఆ ఆడబిడ్డలను, అక్కచెల్లెళ్ళను అడగండని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు

Karnataka Hijab Row: కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం (Hijab Row) నెమ్మదిగా దేశ‌వ్యాప్తమైంది. గత నెలలో క‌ర్ణాట‌క‌లోకి ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలలో హిజాబ్ ధరించినకొందరు విద్యార్థినీలు కాలేజీలోకి ప్రవేశం నిరాకరించారు. ఈ ఘ‌ట‌న‌తో నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి తర్వాత కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. 

ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కర్ణాటక పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. ఈ త‌రుణంలో రాజకీయ, సినీ ప్ర‌ముఖులు, సామాజిక వేత్త‌లు, ర‌చ‌యిత‌లు తమదైన శైలిలో స్పందిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఈ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గురువారం ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హిజాబ్ వివాదంపై యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఏ ముస్లీం మహిళ హిజాబ్ ను ఇష్టానుసారంగా ధరించదనీ, హిజాబ్‌ను ముస్లిం మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారని అన్నారు. ట్రిపుల్ తలాక్‌‌ను ఎవరైనా ఇష్టపడి అంగీకరించారా? అని ప్రశ్నించారు. ఆ ఆడబిడ్డలను, సోదరీమణులను అడగండన్నారు. తాను వారి కన్నీళ్లను చూశాననీ, వారు తమ కష్టాలను చెప్పుకుంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నారని అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసినందుకు జౌన్‌పూర్‌కు చెందిన ఒక మహిళ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారన్నారు. దుస్తులు ఎంపిక వ్యక్తిగతమ‌నీ, ఆ వ్యక్తి ఇష్టంపై ఆధారపడు తుందన్నారు. తాను తనకు నచ్చినదానిని ఇతరులపై రుద్దలేదని చెప్పారు.

‘‘నా కార్యాలయంలో అందరినీ భగువా (కండువా) ధరించమని కోరగలనా? నా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆ విధంగా చెప్పగలనా? నేను అలా చేయలేను. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలి. ఏదైనా ఉంటే సంస్థ, ఆ సంస్థలో క్రమశిక్షణ ఉండాలి" అని అన్నారు. ప్రస్తుతం హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. 

పాఠశాలలు, కళాశాలల్లో బాలికలు, మహిళలు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజుల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని కొందరు ముస్లిం బాలికలను కాలేజీల్లోకి రానీయకుండా నిషేధించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో హిజాబ్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై జాతీయ రాజకీయ పార్టీలు పరస్పరం దాడులు చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది.