గుజరాత్, మహారాష్ట్రలను నిసర్గ తుఫాను వణికిస్తోంది. వచ్చే 12 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా నిసర్గ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముందుగా ఉత్తర దిక్కు వైపు తుఫాను కదులుతుందని చెప్పినప్పటికీ, ఆ తర్వాత దిశ మార్చుకుని ఈశాన్యంవైపు కదులుతూ ఉత్తర మహారాష్ట్, దక్షిణ గుజరాత్ మధ్య నిసర్గ తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

బుధవారం తీరం దాటే సమయంలో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతాయని.. చెట్లు నేలకూలే ప్రమాదముందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది.

దీంతో అప్రమత్తమైన కేంద్రం, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు 39 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాయి. మరోవైపు ముంబై నగర పాలక సంస్థ సైతం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

ఈ తుఫాన్.. ప్రస్తుతం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 280 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 450 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షిణ నైరుతి దిశలో 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో వాతావరణవిభాగం పేర్కొంది.