దేశంలో ట్రాఫిక్ రూల్స్ మారాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటార్ వాహనాల చట్టం 2019 తీసుకువచ్చింది. దీని ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. కేవలం ఒక్కరోజులోనే 5వేల మంది వాహనదారులకు చలానాలు విధించినట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తున్న వాహనదారులకు కొత్త చట్టం ప్రకారం చలానాలు విధిస్తున్నట్లు వారు తెలిపారు.  ఈ 5వేలమంది వాహనదారులు కేవలం ఢిల్లీ, నోయిడా ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం.  వీరిలో నోయిడాలో 1329మంది వాహనదారులు ఉండగా.. 3,900మంది ఢిల్లీకి చెందిన వారు. కాగా.... దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువమందే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

నో పార్కింగ్‌ ప్లేస్‌లో వాహనాలను నిలిపి ఉంచినందుకు ఆదివారం 293, సోమవారం 287 వాహనాలకు చలాన్లు విధించారు. హెల్మెట్లు ధరించకుండా వాహనాలు నడిపిన 571 ద్విచక్ర వాహనదారులకు, సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపిన 361 మందికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఈ రెండు రోజుల్లో 90 మంది సిగ్నల్‌ జంప్‌ చేశారు. ట్రిపుల్‌ రైడింగ్‌, పొల్యూషన్‌, డ్రైవ్‌ చేస్తూ ఫోన్లలో మాట్లాడిన వాహనదారులతో పాటు సరైన నెంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధించారు.

మద్యం సేవించి వాహనం నడిపితే భారీగా రూ.పదివేలు జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. హెల్మెట్ లేకున్నా... సీటు బెల్టు పెట్టుకోకున్నా.. రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నామని చెప్పారు.