అహ్మదాబాద్: నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటినుంచి ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు భారీ స్థాయిలో వడ్డిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై యావత్తు దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో నెటిజన్స్ అయితే బాగోలేని రోడ్ల ఫోటోలు తీసి ప్రభుత్వ అధికారులకు సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్నారు. 

ఈ భారీ స్థాయిలో మోత మోగుతున్న చలానాలు కట్టలేక ఢిల్లీలోని ఒక వ్యక్తి తన బండిని వదిలేసి వెళ్ళాడు. ఇంకోవ్యక్తి తన బండికి నిప్పంటించాడు. తాజాగా అహ్మదాబాద్ నగరానికి చెందిన ఒక ఆటోవాలా ఏకంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

వివరాల్లోకి వెళితే, రాజు సోలంకి అనే వ్యక్తి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని అతనికి 18వేల రూపాయల జరిమానా విధించారు. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు బ్రతుకు, డబ్బులు కట్టలేనని పోలీసుల కాళ్ళా వేళ్ళా పడ్డాడు. అయినా తామేమి చేయలేమని వారు చెప్పారు. డబ్బులు కట్టకపోవడంతో ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆటో ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రోజు గడవడం కష్టంగా మారింది. దాంతో ఇంట్లో అందుబాటులో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. మీడియాతో మాట్లాడుతూ తనకు ఆటో ఒక్కటే జీవనాధారమని, తన ఆటోని తనకు ఇప్పించమని అందరినీ వేడుకున్నాడు. తాను నిరుద్యోగిగా మిగిలిపోకూడదనే ఆటో కొనుక్కున్నట్టు తెలిపాడు. తాను బీకామ్ చదివానని, కానీ ఉద్యోగం లభించకపోవడం వల్ల ఇలా ఆటో నడుపుకుంటున్నట్టు తెలిపాడు.