Asianet News TeluguAsianet News Telugu

ఉత్తర భారతాన్ని ముంచెత్తిన చలి.. ద‌ట్ట‌మైన పొగ‌మంచుతో విమానాల రాకపోకలు ఆల‌స్యం

New Delhi: ఉత్త‌ర భార‌తంలో ఇంకా చ‌లి పంజా కొన‌సాగుతోంది. ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్ప‌డింది. దేశ‌ రాజ‌ధాని ఢిల్లీ, పంజాబ్, హ‌ర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు, పొగమంచు వాతావరణం నెలకొంది.
 

New Delhi:Cold wave hits north India. Flights delayed due to dense fog
Author
First Published Jan 15, 2023, 11:23 AM IST

North India-Cold: దేశంలోని చాలా ప్రాంతాల్లో చ‌లి పంజా కొన‌సాగుతోంది. చ‌లి గాలులు, ద‌ట్ట‌మైన పొగ‌మంచు నెల‌కొన్న చ‌ల్ల‌ని ఉద‌యం ప్ర‌జ‌ల‌ను నిద్ర‌లేపుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ‌రాజ‌ధాని లోనూ చ‌లి తీవ్ర‌త పెర‌గ‌డంతో పాటు ద‌ట్ట‌మైన పొగమంచుతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై కూడా తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. ఆదివారం తెల్లవారుజామున సఫ్దర్‌జంగ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెల్సియస్ గా న‌మోదుకాగా పాలం ప్రాంతంలో దృశ్యమానత 200 మీటర్లుగా నమోదైంది. 

ఉత్త‌ర భార‌తం అంత‌టా పెరుగుతున్న చ‌లి.. 

మ‌ధ్య దేశాల నుంచి వీస్తున్న చ‌లిగాలుల కార‌ణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దీనికి తోడు శీతాకాల ప‌రిస్థితుల‌తో ఉత్త‌ర భార‌తంతో చ‌లి తీవ్ర‌త ఉంది. అలాగే, ద‌ట్ట‌మైన పొగ‌మంచు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో క‌నిపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు కొత్త రికార్డులు న‌మోదుచేస్తున్నాయి. దేశ‌రాజ‌ధాని ఢిల్లీ, పంజాబ్, హ‌ర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు, పొగమంచు వాతావరణం నెలకొంది.

ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం.. 

ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగా వాహ‌నాల రాక‌పోక‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. ఉత్త‌ర భార‌తంలోని చాలా ప్రాంతాల్లో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో దేశ రాజధాని నుంచి బయలుదేరాల్సిన కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. కనీసం 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు. రోడ్డుపై వాహ‌నాలు సైతం దృశ్య‌మాన‌త త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌యాణాలు ఆల‌స్యం అవుతున్నాయి. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో నేటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. 

పెరిగే చ‌లి.. త‌గ్గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు ! 

దేశంలోని ప‌లు ప్రాంతాల‌తో పాటు ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని భార‌త వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగానే అంచనా వేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందనీ, అయానగర్, రిడ్జ్ వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు దృష్ట్యా ప్రజలు తమ బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేసుకోవాల‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మైదాన ప్రాంతాల్లో మైన‌స్  ఉష్ణోగ్రతలు..

జనవరి 16 నుంచి 18 వరకు మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. "దీనిని ఎలా చెప్పాలో తెలియదు కానీ #భారతదేశంలో #Coldwave రాబోయే స్పెల్ 14-19 జనవరి 2023లో 16-18న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటివరకు అంచనా మోడల్‌లో ఉష్ణోగ్రత సమిష్టి ఇంత తక్కువగా ఉండటం చూడలేదు.. మైదానాల్లో -4°c నుండి +2°c వరకు గడ్డకట్టే ఉష్ణోగ్ర‌త‌లు ఉండ‌వచ్చు" అని ట్వీట్ చేశారు.

 

అయితే, ఈ వాదనను వాతావరణ సంస్థ స్కైమెట్ తోసిపుచ్చింది. ఢిల్లీలో జనవరి 16 నుంచి 18 మధ్య కనిష్ఠంగా 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయనీ, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ 0 డిగ్రీలకు తగ్గదని పేర్కొంది. ఐసోలేటెడ్ ప్రాంతాల్లో కనీసం 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని స్కైమెట్ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios