మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ అరెస్టుపై శరద్ పవార్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే నవాబ్ మాలిక్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
ముంబై అండర్ వరల్డ్, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీం (Dawood Ibrahim) కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik)ను అరెస్టు చేయడంపై ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే మాలిక్‌ను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ (bjp) ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఎన్సీపీ (ncp) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆరోపించారు. నవాబ్ మాలిక్ కేంద్రంపై బహిరంగంగా మాట్లాడారని ఆయనపై వేధింపులు వస్తాయని తమకు ముందే తెలుసని అన్నారు. ఏదో ఒక రోజు ఇలాంటిది జరుగుతుందని ఊహించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏజెన్సీలపై ఎలా దుర్వినియోగానికి పాల్పడుతుందనే దానికి ఇది ఒక ఉదహారణ.
90వ దశకం ప్రారంభంలో కూడా ఇలాగే జరిగాయని శరద్ పవర్ అన్నారు. ‘‘ అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచాయి. కేంద్రానికి వ్యతిరేకంగా పదవులు తీసుకునే వారిని ఇబ్బంది పెట్టడానికి దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ (అండర్ వరల్డ్) పేర్లను తీసుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది.’’ అని ఆయన అన్నారు.
మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేస్తున్న నవాబ్ మాలిక్ ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన అరెస్టు తరువాత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మంత్రులు ఛగన్ భుజ్‌బల్, హసన్ ముష్రిఫ్, రాజేష్ తోపే శరద్ పవార్‌తో కలిసి ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. అరెస్టు తరువాత నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
బుధవారం ఉదయం మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ను ఈడీ అరెస్టు చేసింది. దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ED ఆఫీసుకు ఉదయం 8 గంటలకు చేరుకుకొని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అతని వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే ఈ కేసులో నవాబ్ మాలిక్ ను ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు మార్చి 3 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది.
