Punjab Assembly Election 2022: పంజాబ్ రాజ‌కీయం రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. తాను పీసీసీ చీఫ్‌గా ఉన్నంత కాలం.. ఏ ఒక్క‌ ఎమ్మెల్యే కుమారుడికి చైర్మన్ పదవి రాదని, కార్యకర్తలకు పదవులు దక్కవని... ఎవరికైనా ప్రత్యేక హోదా వస్తే ఆ రోజు రాజీనామా చేస్తానని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజ‌కీయం రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ రాజకీయం రోజుకో అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఎన్నో రోజులుగా కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి ఎవ‌రనే ఉత్కంఠకు నిన్న‌టితో తెరప‌డింది. ఎట్టకేలకు పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని అధిష్టానం ప్రకటించింది. సీఎం అభ్య‌ర్థిత్వం కోసం ఎంత‌గానే ఎదురు చూస్తున్నా.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా కొనసాగితే.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. 

ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన త‌రువాత ఆసక్తిక‌ర‌ ప్రకటన వెలువడింది. ‘నేను పీసీసీ చీఫ్‌గా ఉన్నంత కాలం.. ఏ ఎమ్మెల్యే కుమారుడికీ చైర్మన్ పదవి రాదని.. కార్యకర్తలకు ప‌ద‌వులు దక్కదని.. ఎవరికైనా ప్రత్యేక హోదా వస్తే.. ఆరోజే రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్నా’ అని ప్రకటించారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ హయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చార‌ని తీవ్ర‌ విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే..

ఆదివారం లూథియానాలో జరిగిన వర్చువల్ ర్యాలీలో సిద్ధూ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాను ఏ పదవి కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌నీ, పంజాబ్ అభివృద్ధిని, పంజాబీ ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నానని అన్నారు. పీసీసీ చీఫ్ గా కొన‌సాగుతాన‌ని అన్నారు. పంజాబ్ సమస్యల ప‌రిష్క‌రం కోసం.. పోరాడే నాయ‌కుడిగా ఉంటాన‌ని అన్నారు.

అస‌లు వివాద‌మేంటీ?

అమరీందర్ సింగ్.. పంజాబ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌డు.. జూన్ 2021లో త‌న‌ నేతృత్వంలోని క్యాబినెట్లో ఉన్న‌.. ఎమ్మెల్యే ఫతే జంగ్ సింగ్ బజ్వా కుమారుడు అర్జున్ పర్తాప్ సింగ్ బజ్వాను పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్ బి అధికారి)గా, లూథియానా ఎమ్మెల్యే రాకేష్ పాండే కుమారుడు భీషమ్ పాండేను నాయబ్ ను తహసీల్దార్‌గా నియమించారు. ఈ నియమాకాల‌పై తీవ్ర స్థాయిలో దూమారం రేగింది. ఈ త‌రుణంలోనే అమరీందర్ సింగ్, సిద్ధూ మ‌ధ్య కొన్ని నెలల పాటు వైరం కొన‌సాగింది.

తర్వాత..అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి .. సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అనంత‌రం..సిద్దూ కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జ‌రుగ‌నున్న‌ది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.