ఖర్గోన్: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నర్మదా నది పూజకోసం పడవలో నదిలోకి వెళ్లి మహిళలు నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా ఆ పడవ బోల్తా పడింది. దీంతో మహిళలంతా నీటిలో పడిపోగా మిగతా పడవల్లోని వారు వారిని కాపాడారు. అయితే ఓ మహిళ, మరో యువకుడు మరణించారు. 

వివరాల్లోకి వెళితే... మధ్య ప్రదేశ్ నావ్‌ఘాట్ ఖెడీ ప్రజలు ప్రతి ఏడాది నర్మదా నది పూజ చేపడతారు. ఇందులోభాగంగా ప్రజలు పడవల్లో నదిలోకి వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా తాజాగా మూడు పడవల్లో నర్మదా నదిలోకి వెళ్లగా ప్రమాదం చోటుచేసుకుంది. 

నదిలోకి వెళ్లిన ఓ పడవలో 11మంది మహిళలు నృత్యం చేస్తుండగా మరో పడవలో డప్పులు, ఇంకో పడవలో మరికొంతమంది ప్రజలు వున్నారు. అయితే మహిళలు నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా పడవ బ్యాలెన్స్ కోల్పోయి బోల్తా పడింది. దీంతో మహిళలంతా నీటిలో పడిపోయారు. 

అయితే మిగతా పడవల్లో వున్నవారు వెంటనే స్పందించి నీటిలో పడిపోయిన మహిళలను కాపాడారు. కానీ ఓ మహిళ, యువకుడు మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. పడవలోని మిగతా మహిళలంతా సురక్షితంగా వున్నారు.