ఉత్తరప్రదేశ్: నకిలీ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యుడు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఫేక్ సర్టిఫికెట్స్ తో వేలాదిమందికి శస్త్రచికిత్సలు చేసిన ఆ కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మున్నాభాయ్ ఎంబీబీఎస్ డాక్టర్ ను తలపించిన ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవ్‌బంద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ మీరట్ లోని సహరాన్ పూర్ జిల్లాలోని దేవ్ బంద్ పట్టణంలో నకిలీ డాక్టర్ బండారం బట్టబయలైంది. 

ఓంపాల్ మిశ్రా అనే వ్యక్తి తాను డాక్టరునంటూ నకిలీ సర్టిఫికెట్ చూపించి సాక్షాత్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి పదేళ్లపాటు వేలాది శస్త్రచికిత్సలు చేసిన బాగోతాన్ని యూపీ పోలీసులు బట్టబయలు చేశారు. 

ఓంపాల్ అనే వ్యక్తి 2000 సంవత్సరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పారామెడిక్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ అనంతరం మంగళూరు నగరానికి చెందిన డాక్టర్ రాజేష్ ఆర్ తో కలిసి ఆసుపత్రిలో పనిచేశాడు.
 
డాక్టర్ రాజేష్ ఆర్ విదేశాలకు వెళ్లిపోవడంతో అతని డిగ్రీ సర్టిఫికెట్ ను క్లోనింగ్ చేసి ఓంపాల్ మిశ్రా తన ఫోటో పెట్టుకున్నాడు. అంతేకాదు తన పేరును సైతం మార్చేసుకున్నారు. డాక్టర్ రాజేష్ శర్మ పేరుతో నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ చూపించి యూపీలో మెడికల్ ప్రాక్టీషనరుగా చెలామణి అయ్యాడు.  

అనంతరం దేవ్ బంద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి చేరాడు. గడచిన పదేళ్ల కాలంలో వేలాది ఆపరేషన్లు చేశాడు. అయితే వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అన్నది సర్వత్రా ఆందోళన నెలకొంది. 

అయితే నకిలీ సర్టిఫికెట్ తో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న ఓంపాల్ మిశ్రాను ఓ ఆగంతుకుడు గుర్తించాడు. తనకు రూ.40లక్షలు ఇస్తే ఈ వ్యవహారాన్ని బయటపెట్టనని లేకపోతే బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు.  

ఆగంతుకుడి వేధింపులకు భయపడ్డ ఆ నకిలీ డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నకిలీ డాక్టరు బాగోతం బట్టబయలైంది. నకిలీ డాక్టర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.