మధ్యప్రదేశ్ : ఒకప్పుడు  హత్య కేసులో వార్తల్లోకెక్కిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇటీవల మళ్లీ వార్తల్లోకెక్కారు. భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. 

ఈసీ చర్యలు తీసుకున్న ఆమెను వివాదాలు మాత్రం విడవకుండా వెంటాడుతూనే ఉన్నాయి. ఆఖరికి సొంతపార్టీ నేతల నుంచి చీవాట్లు కూడా పడాల్సిన పరిస్థితి. ప్రధాని నరేంద్రమోదీ అయితే ఏకంగా ఆమెను జీవితంలో క్షమించలేనంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

ఇలాంటి తరుణంలో ప్రఙ్ఞాసింగ్‌ ఠాకూర్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిందితురాలిగా ఉన్న ఆరెస్సెస్‌ ప్రచారక్‌ హత్యకేసును రీఓపెన్‌ చేసేందుకు కమల్‌నాథ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2007, డిసెంబరు 29న సునీల్‌ జోషి అనే ఆరెస్సెస్‌ ప్రచారక్‌ దారుణ హత్యకు గురయ్యారు. 

కాంగ్రెస్‌ నాయకుడి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ జోషి అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఆకేసులో సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ తోపాటు మరో ఏడుగురికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

అయితే వారిపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో 2017లో కోర్టు వీరిని నిర్దోషులుగా తేల్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును తిరగదోడేందుకు కమల్ నాథ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

భోపాల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గెలిచే అవకాశం ఉందని తెలియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పాత  కేసులను తెరపైకి తెస్తోంది.  సునీల్‌ జోషి హత్య కేసును తిరిగి ఓపెన్‌ చేసేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని రాష్ట్ర న్యాయశాఖా మంత్రి పీసీ శర్మ స్పష్టం చేశారు. 

ఈ కేసు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ కేసులో దేవాస్‌ కలెక్టర్‌ తన సొంత నిర్ణయాల మేరకు కేసును మూసి వేశారని, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు ఫైలన్ ను సమర్పించాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించింది ప్రభుత్వం. 

సునీల్‌ జోషి హత్యకేసును తిరగదోడటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై ప్రజ్ఞాసింగ్ పోటీ చేసినందుకే ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కమల్ నాథ్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇకపోతే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ 2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో కూడా నిందితురాలిగా ఉన్నారు.