రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. కుమారుడు కలగలేదని మానసిక క్షోభతో ఒక తత్లి తన ఐదుగురి కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాడ్మేర్ జిల్లా బావ్డీ గ్రామానికి చెందిన రాణారామ్ జాట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.

అతనికి 20 ఏళ్ల క్రితం వనూదేవితో వివాహమైంది. వీరికి సంతోష్, మమత, మైనా, హంస, హేమలత అనే ఐదుగురు కుమార్తెలు పుట్టారు. అయితే తమకు పుత్రుడు కలగలేదని ఆమె తరచుగా బాధపడుతూ, తీవ్ర మానసిక వేధనకు గురయ్యేది.

ఈ క్రమంలో బుధవారం భర్త పాఠశాలకు వెళ్లగానే వనూదేవి ముందుగా తన ఐదుగురు కుమార్తెలను బావిలోకి తోసివేసి.. అనంతరం తాను కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఈ వార్త గ్రామం మొత్తం వ్యాపించడంతో విషాద వాతావరణం చోటు చేసుకుంది. బాలికలంతా చదువులో ఎంతో ముందుడేవారని తెలుస్తోంది.

స్థానిక మదర్ థెరీసా స్కూలులో చదువుతున్న సంతోష క్లాసులో టాపర్.. ఆమె 8వ తరగతిలో 98 శాతం మార్కులను సంపాదించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాశీ డోగ్రా మాట్లాడుతూ... తానూ ఒక తల్లినేనని.. ఘటనాస్థలానికి వచ్చి చూడగానే షాక్‌కు గురయ్యానన్నారు.

ఒక తల్లిగా ఆమెకు ఐదుగురు కుమార్తెల ప్రాణం తీయాలని ఎలా అనిపించిందో తెలియడం లేదన్నారు. ఈ కాలంలో కూడా, కూతుర్లను వేరుగా చూసే భావన తొలగకపోవడం దురదృష్టకరమన్నారు.

ఇకనైనా ఆడపిల్లల విషయంలో ప్రజలు తమ దృష్టి కోణాన్ని మార్చుకోవాలనుకున్నారని.. ఇటువంటి అంశాలపై ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు అవగాహనా శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.