తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్నతల్లే తన బిడ్డను కడతేర్చింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లా పెరుందురై అయ్యప్పన్ నగర్‌కు చెందిన కార్తికేయన్ అతని భార్య భువనేశ్వరి, మూడేళ్ల కొడుకు కిశోర్‌తో నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో భువనేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన సోమసుందరంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కార్తీకేయన్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో భువనేశ్వరి భర్త నుంచి విడిపోయి కుమారుడు కిశోర్‌తో సహా ఇంటి నుంచి పారిపోయింది.

అంబత్తూరు మేనంమేడు వువుసి నగర్‌లో ఓ అద్దె ఇంట్లో సోమసుందరంతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం చిన్నారి బాలుడు కిశోర్ మిద్దెపై నుంచి కిందపడి మృతిచెందాడని పెరుంతురైలో ఉన్న అత్తకు భువనేశ్వరి సమాచారం తెలిపింది.

దీంతో బాలుడికి అంత్యక్రియలు చేయడానికి పట్టుకోటైలో ఉన్న భువనేశ్వరి అక్క ఇంటికి తీసుకొచ్చారు. ఆమె అక్కకు కిశోర్ మరణంపై సందేహం కలగడంతో పోలీసులకు సమాచారం అందించింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేసి హత్యగా నిర్ధారించారు. దీని గురించి అంబత్తూరు ఏసీపీకి పట్టుకోట్టై పోలీసులు సమాచారం అందించడంతో.. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.

అనంతరం జరిపిన విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో తల్లి, ఆమె ప్రియుడు కలిసి చిన్నారిని హత్య చేసినట్లుగా తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.