ఆపకుండా గుక్కపట్టి ఏడుస్తున్నాడని ఓ తండ్రి ఆరేళ్ల కొడుకుని బండకేసి కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఒడిశా రాష్ట్రం మయూర్ భంజ్ జిల్లా శరత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లావణ్యదెయపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లావణ్యదెయపూర్ గ్రామానికి చెందిన మధుసింగ్ కు ఇద్దరు కుమారులు. కొంత కాలం క్రితం మధుతో గొడవ పడి భార్య... పెద్ద కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. కాగా.. చిన్న కొడుకు సర్దార్ సింగ్(6) మాత్రం తండ్రి మధుసింగ్ దగ్గరే ఉంటున్నాడు. 

కాగా... మంగళవారం మధుసింగ్ పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో సర్దార్ ఏడుస్తూ కనిపించాడు. ఎంతసేపు ఏడుపు ఆపమని బ్రతిమిలాడినా ఆపలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన మధు సింగ్... కొడుకు సర్దార్ ని ఎత్తి బండకేసి కొట్టాడు. దీంతో బాలుడి తలకు తీవ్రగాయమై.. రక్తస్రావం జరిగింది. గమనించిన గ్రామస్థులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. వారిపై కూడా దాడి చేశాడు.

దీంతో.. గ్రామస్థులు మధుని తాళ్లతో కట్టేసి... బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా... అప్పటికే ఆలస్యం కావడంతో బాలుడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.