స్నేహితుడి కూతురు అంటే... సొంత కూతురితో సమానం. అలాంటిది ఆ స్నేహితుడికి ద్రోహం చేసి...అతని కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక వయసు కేవలం ఐదు సంవత్సరాలే కావడం గమనార్హం. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా... ఈ దారుణానికి పాల్పడ్డారు.  ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. అయితే... తన కూతురికి జరిగిన అన్యాయానికి అతను బాధపడుతూ కూర్చోలేదు. నిందితులు ఇద్దరిలో ఒకరిని నరికి చంపేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గోపాలపురానికి చెందిన తన మిత్రులు కార్తి(24), మురుగన్ తో కలిసి సోమవారం రాత్రి మద్యం సేవించాడు. ఆ మత్తులోనే వారిద్దరినీ తన ఇంటికి తీసుకువెళ్లాడు. 

అక్కడికి వెళ్లిన తర్వాత... కార్తీ, మురుగన్ లు... తమ స్నేహితుడి ఐదేళ్ల కుమార్తెను బయటకు తీసుకువెళ్లారు. చాక్లెట్స్ కొనిస్తామని చెప్పి నమ్మించి తీసుకువెళ్లి... అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు గంటలు గడిచినా ఇంకా తమ కుమార్తెను ఇంటికి తీసుకురాకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది.

వెంటనే బాలికకోసం గాలించగా... ఇంటికి సమీపంలోని ఓ ప్రాంతంలో తీవ్ర రక్తస్రావంతో బాలిక పడి కనిపించింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు తేల్చి చెప్పారు. వెంటనే బాలిక తండ్రి కోపంతో ఊగిపోయాడు. తన స్నేహితులు కార్తి, మురగన్ కోసం వెతికాడు.

వాళ్లు దొరకగానే...కత్తి తీసుకొని కార్తీ తల, నడుము భాగంలో నరికివేశాడు. మురుగన్ పై కూడా దాడి చేయాలని ప్రయత్నించగా.. అతను పరారయ్యాడు. కాగా.. కార్తీ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కార్తీని చంపిన కేసులో పోలీసులు బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.