Maharashtra : మే 3న మహారాష్ట్రలోని స్థానిక దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించి 'మహా హారతి' MNS కార్యకర్తలు నిర్వహించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని తగిన అనుమతితో మాత్రమే అనుమతిస్తామని మహారాష్ట్ర హోం శాఖ సోమవారం స్పష్టం చేసిన క్రమంలో ఎంఎన్ఎస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
Maharashtra : మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్లు, మైకుల రగడ కొనసాగుతోంది. మసీదులపై ఉన్న మైకులు, లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఇదివరకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే చేస్తున్న ఉద్యమం మరింతగా ముదురుతోంది. మొదట ఆయన మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే.. వాటి ముందు స్పీకర్లు, మైకులు పెట్టి హనుమాన్ చాలీసా ప్లే చేస్తామంటూ హెచ్చరించారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. మే 3లోగా మసీదులపై ఉన్న లౌడ్ స్పీకర్లను తొలగించాలనీ, లేకుంటే.. మసీదుల వెలుపల లౌడ్ స్పీకర్లు పెట్టి 'హనుమాన్ చాలీసా' ప్లే చేస్తామని హెచ్చరించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సర్కారు.. అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని పలువురు నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని తగిన అనుమతితో మాత్రమే అనుమతిస్తామని మహారాష్ట్ర హోం శాఖ సోమవారం స్పష్టం చేసింది.

లౌడ్ స్పీకర్ల అంశం ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది. కర్నాటక సైతం మసీదులపై లౌడ్ స్పీకర్లు, మైకుల విషయంలో చర్యలకు సిద్దమైంది. ఇక మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) మే 3న అక్షయ తృతీయ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ స్థానిక దేవాలయాల్లో తమ కార్యకర్తలు 'మహా హారతి' నిర్వహిస్తారని తెలిపింది. లౌడ్ స్పీకర్లను ఉపయోగించి 'మహా హారతి' నిర్వహిస్తామని MNS నాయకుడు నితిన్ సర్దేశాయ్ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, రాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కూడా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మరియు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై చర్చించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ముంబయి పోలీస్ కమిషనర్‌తో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై వచ్చే ఒకటి లేదా రెండు రోజుల్లో మార్గదర్శకాలను రూపొందిస్తారని పాటిల్ చెప్పారు.
మే 3లోగా మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే హిందూ సోదరులు హనుమాన్ చాలీసా ప్లే చేయడానికి సిద్ధంగా ఉండాలని MNS చీఫ్ రాజ్ థాక్రే ఆదివారం మరోసారి పిలుపునిచ్చారు. లౌడ్ స్పీకర్లు 'ఆజాన్' కాల్‌ను ప్రసారం చేయడం మతపరమైన సమస్య కంటే సామాజిక సమస్య అనీ, లౌడ్‌స్పీకర్ల వాడకం కొనసాగితే వారు (ముస్లింలు) కూడా లౌడ్‌స్పీకర్లలో మన ప్రార్థనలను వినవలసి ఉంటుందని ఆయన అన్నారు. "మసీదుల పైన లౌడ్ స్పీకర్లు పెట్టడం మతపరమైన సమస్య అని ప్రజలు అనుకుంటారు, కానీ ఇది సామాజిక సమస్య. మీరు రోజుకు ఐదుసార్లు లౌడ్ స్పీకర్లను ప్లే చేయాలనుకుంటే, మేము మసీదుల ముందు ఐదుసార్లు 'హనుమాన్ చాలీసా' ప్లే చేస్తాము. హిందూ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రంజాన్ ముగిసే వరకు మే 3 వరకు వేచి ఉంటాం.. కానీ వారు ఆగకపోతే న్యాయవ్యవస్థ కంటే తమ మతమే పెద్దదని భావిస్తే మేం టిట్ ఫర్ టాట్ ఇస్తాం.. అందుకు ఎంఎన్‌ఎస్ సిద్ధమవుతోంది" అని పేర్కొన్నారు.
