మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న 19 ఏళ్ల టీనా చౌదరి అనే యువతిని శుక్రవారం రాత్రి కాల్చి చంపారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. దీన్ని పరువు హత్యగా భావిస్తున్నారు. 

తీవ్రంగా గాయపడిన యువతిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేర్చారు. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. దాంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. సాయుధులు దోపిడీకి వచ్చి హత్య చేశారని కుటుంబ సభ్యులతో తొలుత పోలీసుల వద్ద బుకాయించే ప్రయత్నం చేశారు. రక్తం మరకలను తుడిచేయడానికి కూడా ప్రయత్నించారు. 

యువతికి మూడు చోట్ల బుల్లెట్ గాయాలు తగిలినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఒకటి తొడ లోపలి భాగంలో, రెండోది ప్రైవేట్ పార్ట్స్ లో ఛాతీకి కొంచెం పైభాగంలో మూడో బుల్లెట్ తగిలినట్లు తేలింది. బాలిక కజిన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగినప్పుడు ఉన్న అతని తల్లిదండ్రులపై, బాలిక తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. 

సంఘటనా స్థలంలో ఎంతో రక్తం పడిందని, పగిలిన గాజులు కూడా లభించాయని, బాలిక పెనుగులాడినట్లు అనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. శరీరం తెల్లగా మారిపోయిందని, దాన్ని బట్టి తాము చూడడానికి ఐదారు గంటల ముందే హత్య జరిగి ఉంటుందనేది అర్థమవుతోందని వారన్నారు. 

యువతికి ఓ యువకుడితో ఉన్న సంబంధాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారని, గొడవలు కూడా జరుగుతుండేవని అంటున్నారు. శనివారం జరిగిన గొడవలో కజిన్ ఆమెపై కాల్పులు జరిపి ఉంటాడని చెబుతున్నారు. 

మద్యం మత్తులో తమ కజిన్ కిట్టు అలియాస్ ప్రశాంత్ చౌదరి టీనాను కాల్చి చంపాడని యువతి సోదరుడు చెప్పాడు. కిట్టు, అతని మిత్రుడు సల్మమాన్ మిత్రుడి జన్మదిన వేడుకల్లో శనివారం రాత్రి తప్ప తాగారని, యువతికి ఉన్న అఫైర్ తమకు తెలుసునని, అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆమె దాన్ని కొనసాగిస్తోందని, కుటుంబ సభ్యులందరి ముందే కిట్టు ఆమెపై కాల్పులు జరిపాడని వివరించాడు.

ప్రధాన నిందితుడు కిట్టు, అతని మిత్రుడు సల్మాన్ పరారీలో ఉన్నారు. నలుగురు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.