కన్న కూతురిలా చూడాల్సిన కోడలిపై సొంత మామే కన్నేశాడు. కొడుకు భార్యను లైంగికంగా వేధించాడు. కాగా... మామ వేధింపులు తట్టుకోలని ఆ కోడలు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం అరక్కోణంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అరక్కోణం సమీపంలోని తిరుత్తణిలో ఉన్న వెంకటాపురానికి చెందిన లారీ డ్రైవర్‌ మునికృష్ణన్‌. ఇతని భార్య యువరాణి. లారీ డ్రైవర్‌ వృత్తికారణంగా రాత్రివేళల్లో విధులకు వెళ్లేవాడు.

కోడలికి తోడుగా ఇంట్లో ఉన్న మామ ఢిల్లీబాబు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయాన్ని అనేక సార్లు భర్తకు చెప్పినా వినిపించుకోలేదు. పైగా తండ్రిపై చాడీలు చెబుతున్నావని తిట్టేవాడని తెలిసింది. మామ లైంగిక వేధింపులు, భర్త తనను నమ్మకపోవడంతో విరక్తితో యువరాణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విధులను ముగించుకుని ఇంటికి వచ్చి న మునికృష్ణన్‌ భార్య శవాన్ని చూసి తీవ్రంగా విలపించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి యువరాణి ఆత్మహత్యకు కారణమైన ఢిల్లీబాబును గురువారం అరెస్టు చేసి జైలుకు తరలించారు.