మరో బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో ఇరుక్కున్నారు. వివాహితురాలైన ఓ మహిళా వైద్యురాలిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బామెంగ్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గోరుక్ పొర్దుంగ్ ఇటానగర్ లోని ఓ హోటల్ లో మకాం చేశాడు. ఈ నెల 12వతేదీ రాత్రి తాను ఎమ్మెల్యేను కలిసేందుకు హోటల్ కు వెళితే, అతను తనపై అత్యాచారం చేశాడని వివాహిత అయిన మహిళా వైద్యురాలు ఇటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాగా మహిళా డాక్టరు గతంలో తనను చాలా సార్లు కలిసిందని, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఆమె తప్పుడు కేసు బనాయించారని ఎమ్మెల్యే గోరుక్ పొర్దుంగ్ అంటున్నారు. ఈ నెల 12వతేదీన రాత్రి ఇటానగర్ హోటల్ లో బీజేపీ ఎమ్మెల్యే మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేయగా పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. 

మహిళ ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవముందా? లేదా ? అనేది ప్రాథమిక దర్యాప్తు చేసేందుకు సమయం తీసుకున్నామని, అందుకే కేసు నమోదులో జాప్యం జరిగిందని ఎస్పీ తుమ్మీఅమో చెప్పారు. కాగా ఇప్పటికే ఉన్నావ్ అత్యాచార ఘటనలో ఓ బీజేపీ నేత ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బీజేపీ నేత అత్యాచారం కేసులో ఇరుక్కోవడం గమనార్హం. అయితే... ఈ అత్యాచార ఆరోపణల్లో ఎంత మేర నిజం ఉందో తెలియాల్సి ఉంది.