రాజ్యసభకు వీడ్కోలు పలకనున్న మన్మోహన్ సింగ్.. సేవలను కొనియాడిన కాంగ్రెస్..

భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రాజ్యసభ నుంచి పదవి విరమణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.

Manmohan Singh to bid adieu to Rajya Sabha The Congress praised the services..ISR

మూడు దశాబ్దాల సుధీర్ఘ కాలం తరువాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభకు వీడ్కోలు పలకనున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆ నేత .. వయో భారం వల్ల కొంత కాలంగా వీల్ చైర్ కే పరిమితమయ్యారు. అలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని ముఖ్యమైన బిల్లుల ఓటింగ్ లో పాల్గొన్నారు.

ప్రస్తుతం 91 ఏళ్ల వయస్సున్న మన్మోహన్ సింగ్ ను పీవీ నరసింహారావు తమ మంత్రివర్గంలోకి తీసుకొని దేశ ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగించారు. తరువాత ఆయన తొలిసారిగా 1991 అక్టోబర్ లో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తరువాత వరుసగా 1995, 2001, 2007, 2013లో తిరిగి ఎన్నికయ్యారు.

అయితే మధ్యలో 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 1998-2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలు అందించారు. అయితే ఆ సమయంలో కూడా ఆయన రాజ్యసభ నుంచే పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. 

వాసత్వానికి అస్సాం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం 2019 జూన్ 14 న ముగిసింది. కానీ సిట్టింగ్ బీజేపీ సభ్యుడు మదన్ లాల్ సైనీ మరణం తరువాత 2019 ఆగస్టు 19 న జరిగిన ఉప ఎన్నికలో రాజస్థాన్ నుండి ఎగువ సభకు తిరిగి ఎన్నికయ్యారు. 

కాగా.. రాజ్యసభ కు వీడ్కోలు పలకనున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. సింగ్ రిటైర్మెంట్ తో ఒక శకం ముగిసిందని ఖర్గే ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. మధ్యతరగతి, ఆకాంక్షించే యువతకు మాజీ ప్రధాని 'హీరో'గా మిగిలిపోతారని తెలిపారు.

‘‘క్రియాశీలక రాజకీయాల నుంచి రిటైరైనప్పటికీ, వీలైనంత తరచుగా మన దేశ పౌరులతో మాట్లాడుతూ దేశానికి వివేకం, నైతిక దిక్సూచిగా కొనసాగుతారని నేను ఆశిస్తున్నాను. మీకు శాంతి, ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. దేశం కోసం, ప్రజల కోసం మీలాగా చాలా తక్కువ మంది మాత్రమే పని చేశారు.’’ అని పేర్కొన్నారు ‘‘మధ్యతరగతి, ఆకాంక్షించే యువతకు మన్మోహన్ సింగ్ ఎప్పటికీ 'హీరో'గా మిగిలిపోతారు’’ అని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios