మణిపూర్ కేబినెట్ లో మరో ఆరుగురు మంత్రులుగా చేరారు. వారితో గవర్నర్ లా గణేశన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మణిపూర్ లో బీజేపీ, ఎన్‌పీఎఫ్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వం శనివారం రాష్ట్ర కేబినెట్‌లో మరో ఆరుగురు మంత్రులను చేర్చుకుంది, మంత్రివర్గ బలాన్ని 12 మందికి విస్తరించింది. వీరిలో ఐదుగురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స‌భ్యులుగా కాగా, మ‌రొక‌రు మిత్ర‌పక్ష‌మైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) కు చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. మణిపూర్‌ గవర్నర్‌ లా గణేశన్ ఈ ఆరుగురు మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరిన మంత్రుల్లో పార్టీ సీనియర్ నాయకులు, గత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన లత్‌పావ్ హౌకిప్, మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ కేంద్ర మంత్రి చావోబా సింగ్ కుమారుడు టి బసంత సింగ్ ఉన్నారు. అలాగే మణిపూర్ కొత్త కేబినేట్ లో డాక్టర్ సపమ్ రంజన్ సింగ్, ఎల్ సుసింద్రో మైతేయి, హెచ్ డింగో సింగ్ చేరారు. 

ఎన్‌పీఎఫ్‌ నుంచి కాసిం వాసుమ్‌ మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా మణిపూర్ కేబినెట్‌లో ఇప్పుడు బీజేపీ నుంచి 10 మంది, ఎన్‌పీఎఫ్ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకున్న నెల రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరిగింది. 

గతంలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సింగ్, మార్చి 21న ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో మణిపూర్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు మంత్రులుగా యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్, గోవిందాస్ కొంతౌజం, నెమ్చా కిప్‌గెన్, ఆంగ్‌బౌ న్యూమై లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

ఇటీవల జరిగిన మ‌ణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండ‌గా.. ఆ పార్టీ 32 స్థానాలు కైవ‌సం చేసుకుంది. ఈసారి ఒంట‌రిగానే పోటీ చేసి మెజారిటీ స్థానాలు పొంద‌డం గ‌మనార్హం. అయితే ఈశాన్య రాష్ట్రంలో వ‌రుస‌గా రెండో సారి ఆ పార్టీ అధికారం చేప‌ట్ట‌డం ఇదే తొలిసారి. అయితే మ‌ణిపూర్ లో సీఎం అభ్య‌ర్థిని ఎన్నిక‌లకు ముందుగానే ప్ర‌క‌టించ‌కున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా బీరెన్ సింగ్ ముందుండి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఎన్ బీరెన్ సింగ్ బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఉంటార‌ని, త‌దుప‌రి ప్ర‌భుత్వానికి నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని ఆ పార్టీ అన‌ధికారికంగా ప్ర‌క‌టించింది. హీంగాంగ్ నియోజకవర్గం నుంచి ఎన్ బీరెన్ సింగ్ 18,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఎన్నిక‌ల అనంత‌రం జరిగిన పరిణామాల్లో మ‌ణిపూర్ సీఎంగా బిస్వజిత్ సింగ్ అవుతార‌ని చ‌ర్చ జ‌రిగింది. కానీ చివ‌రికి ఎన్. బీరేన్ సింగ్ కే హైక‌మాండ్ రెండో సారి అవ‌కాశం ఇచ్చింది. అయితే ఈ రాష్ట్రంలో బీజేపీ ఒంట‌రిగా అధికారం చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ నాగా పీపుల్స్ ఫ్రంట్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆ పార్టీకి కూడా మంత్రి వ‌ర్గంలో స్థానం ల‌భించింది. ఆ పార్టీ నుంచి ప్ర‌స్తుత మంత్రివ‌ర్గంలో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు స్థానం ల‌భించింది.