గుర్గావ్‌లో దారుణం జరిగింది. దళిత యువతిని వివాహం చేసుకున్నందుకు గాను ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. మృతుడు దాదాపు ఐదు నెలల క్రితం దళిత మహిళను వివాహం చేసుకున్నాడు.

అప్పటి నుంచి అతని కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం గుర్గావ్‌ సమీపంలోని బాద్‌షాపూర్ గ్రామంలో దాడి చేయడానికి ముందు మృతుడు ఆకాశ్ అతని భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లాడు.

అనంతరం ఆకాశ్ ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా అది నిందితుల్లో ఒకరైన అజయ్ రోడ్డు మీద నడుస్తుండగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది.

అజయ్ తన స్నేహితులను పిలిచి ఆకాశ్‌ను చితకబాది తప్పించుకున్నాడు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఆకాశ్ తన గ్రామానికి చెందిన మహిళను వివాహం చేసుకున్న సంగతి నిందితులకు తెలుసునని పోలీసులు తెలిపారు.

కాగా, దళిత మహిళను వివాహం చేసుకున్నందుకు గాను యువకులు తమను బెదిరించారని మృతుడి సోదరుడు ఎఫ్ఐఆర్‌లో తెలిపాడు. ఈ కులాంతర వివాహం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక యువకులు.. తన సోదరుడు గ్రామంలోకి ప్రవేశిస్తే అతనిని విడిచి పెట్టబోమని బెదిరించినట్లుగా వెల్లడించాడు.

ఆకాశ్ ఉన్నత కులానికి చెందిన వాడు. ఇతని స్వస్థలం రాజస్థాన్‌లోని అల్వార్. వివాహం తర్వాత ఆకాశ్.. అతని భార్య గుర్గావ్‌లోని భోండ్సీకి వచ్చేశారు.