కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలను అతి దారుణంగా హత్య చేసి.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ కి చెందిన ప్రదీప్(37) నిరుద్యోగి. అతనికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. కాగా ప్రదీప్ భార్య ఎయిమ్స్ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తోంది. వీరికి 8,5,3 సంవత్సరాల వయసుగల చిన్నారులు ఉన్నారు. అయితే ప్రదీప్ ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం అతని భార్యకి ఉంది. ఈ విషయంలో భార్య, భర్తల మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య తరచూ ప్రదీప్ పై అనుమానం వ్యక్తం చేస్తోంది దీంతో మనస్థాపానికి గురైన ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.

ముందుగా భార్య, బిడ్డల నోట్లో విషం పోసి ప్లాస్టర్లు వేశాడు. వాళ్ల అరుపులు బయట ఎవరికీ వినపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అనంతరం వారిని హత్య చేశాడు. ఆ తర్వాత సూసైడ్ లెటర్ కూడా రాశాడు. తన భార్య తనను అనుమానించిందని అందుకే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. అనంతంరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

కాగా వారి ఇంట్లో నుంచి ఓ చిన్నారి ఏడుపు బాగా వినపడుతుండటంతో.. స్థానికులు గమనించి ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. కాగా... ప్రదీప్, అతని భార్య, ఇద్దరు బిడ్డలు శవాలై కనిపించగా.. మూడో చిన్నారి తీవ్రగాయాలపాలై కనిపించాడు. చిన్నారిని ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు ఫిర్యాదు  చేశారు. అయితే.. ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.