ఫాస్ట్‌ఫుడ్‌కు పరిగెత్తున్న వారికి వార్నింగ్ ఇచ్చే సంఘటన ఇది. ఆకలితో ఉన్న ఓ వ్యక్తి బర్గర్ తిని రక్తం కక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పుణేకి చెందిన సజీత్ పఠాన్ అనే వ్యక్తి తన స్నహితులతో కలిసి సోమవారం భోజనం చేయడానికి స్థానిక ఎఫ్‌సీ రోడ్‌లో ఉన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌కి వెళ్లాడు.

అనంతరం అతను ఓ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత కొంచెం బర్గర్ తీసుకుని కాస్తంత తిన్నాడు. అది తిన్న వెంటనే ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో పాటు నోటి వెంట రక్తం కక్కుకున్నాడు.

చాలా సేపు గొంతు నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో సజీత్ తిన్న బర్గర్‌ను జాగ్రత్తగా పరిశీలించగా.. దానిలో పగిలిన గ్యాస్ ముక్కలు కనిపించాయి. వెంటనే అతని స్నేహితులు సజీత్‌ను ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు.

విషయం తెలుసుకున్న స్టోర్ యాజమాన్యం... వైద్య ఖర్చుల నిమిత్తం సజీత్‌కు రూ. 15 వేలు ఇచ్చింది. ఆ తర్వాతి రోజు మరో రూ.30 వేలు ఇచ్చి విషయం బయటకు చెప్పవద్దని కోరిందది. దీనిపై బర్గర్ కింగ్ మేనేజర్‌ను ప్రశ్నించగా.. తనకు ఈ విషయం తెలీదని, ఆ రోజు సెలవులో ఉన్నానని తెలిపాడు.

ప్రస్తుతం సజీత్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని... అతని శరీరంలోకి చేరిన గ్లాస్ ముక్క దానంతట అదే బయటకు వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యుల నివేదిక కోసం వేచి చూస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే బర్గర్ కింగ్ ఔట్‌లెట్ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.