గుజరాత్‌లో దారుణం జరిగింది. భార్యతో రోమాన్స్ చేసినట్లుగానే చేసి.. క్షణాల్లో ఆమె నాలుకను కోసేశాడో భర్త. వివరాల్లోకి వెళితే.. అహ్మాదాబాద్ నగరంలోని జుహాపురా ప్రాంతానికి చెందిన ఓ 36 ఏళ్ల వివాహిత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది.

ఆమెకు 2004లో డరియాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది... అయితే ఐదేళ్లలోనే భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కొద్దికాలం ఒంటరిగానే జీవించిన ఆమె 2018 మార్చి 24న జుహాపురాకు చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతనికి గతంలోనే రెండు పెళ్లిళ్లు జరిగినట్లుగా సమాచారం.

ఈ క్రమంలో తన భర్త, అతని రెండో భార్య, కొడుకుతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నాడని బాధితురాలు తెలుసుకుని అభ్యంతరం తెలిపింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవ జరిగేది.

ఇదే సమయంలో కుటుంబపోషణ భారంగా ఉండటంతో ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కాని ప్రారంభించాలని భర్తపై ఒత్తిడి తీసుకొచ్చేది. దీంతో ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈ క్రమంలో గత వారం తనకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో అతడు.. భార్యను చితక్కొట్టాడు.

కాగా.. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న ఆమెతో ఏకాంతంగా గడుపుతున్నట్లు నటించాడు. తనకు నాలుకపై ముద్దు పెట్టుకోవాలని తెలిపాడు. భర్త కోరికను కాదనలేకపోయిన ఆమె నాలుకను బయటకు చాపింది. అంతే రెప్పపాటులో పదునైన కత్తితో ఆమె నాలుకను కోసేశాడు.

అంతేకాకుండా భార్యను గదిలో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె తన సోదరికి వీడియో కాల్ చేసి పరిస్ధితిని తెలియజేసింది. దీంతో ఆమె సోదరి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. పొరుగింటి వారి సాయంతో బాధితురాలని ఎస్‌వీపీ ఆసుపత్రికి తరలించింది.

వైద్యులు అతికష్టం మీద శస్త్రచికిత్స తీసి నాలుకను యథాస్థానంలో ఉంచారు. జరిగిన సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.