loudspeaker issue: లౌడ్ స్పీకర్ల వివాదం మరింతగా ముదురుతోంది. మే 3 తర్వాత ఎలాంటి ఘటనలు జరిగినా తన బాధ్యత ఉండదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే హెచ్చరించారు. మసీదులపై లౌడ్ స్పీకర్లు, మైకుల తొలగింపునకు సంబంధించి ఆయన ఇచ్చిన గడువును మరోసారి గుర్తుచేశారు.
MNS leader Raj Thackeray : మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే రాజేసిన లౌడ్ స్పీకర్లు, మైకుల వివాదం మరింతగా ముదురుతోంది. మసీదులపై మైకులను తొలగించాలనే దానిపై చాలా రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. రాజ్ థాక్రే పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ఔరంగాబాద్‌లో భారీ ర్యాలీ ఆయన ప్రసంగిస్తూ మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి మే 3 డెడ్‌లైన్‌కు కట్టుబడి ఉన్నానని, అలా చేయకపోతే హిందువులందరూ ఆ మత స్థలాల వెలుపల హనుమాన్ చాలీసా ప్లే చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లు, మైకుల తొలగింపునకు మే 3 డెడ్‌లైన్ తర్వాత ఎలాంటి ఘటనలు జరిగినా తనది బాధ్యత కాదని అన్నారు. మహారాష్ట్ర సర్కారుపై తీవ్ర స్థాయిలో మరోసారి విమర్శలు గుప్పించారు. ఒక వేళ ప్రభుత్వం ఈ విషయాన్ని మత సమస్యగా మార్చాలనుకుంటే ఎంఎన్ఎస్ దానికి తగిన రీతిలో సమాధానం ఇస్తుందంటూ హెచ్చరించారు. లౌడ్ స్పీకర్ల సమస్య సామాజిక సమస్య అని పేర్కొన్నారు.
"మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి మే 3 గడువు తర్వాత అన్నింటికీ నేను బాధ్యత వహించను" అని రాజ్ థాక్రే అన్నారు. శరద్ పవార్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత కుల రాజకీయాలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. 'హిందూ' అనే పదం తనకు అలెర్జీ అని ఆరోపించారు. "లౌడ్ స్పీకర్స్ ఒక సామాజిక సమస్య, కానీ దానిని మతపరమైనదిగా చేస్తే, మేము అదే పద్ధతిలో సమాధానం ఇస్తాము. మే 3 న ఈద్ జరుపుకుంటారు. మేము వాతావరణాన్ని నాశనం చేయకూడదనుకుంటున్నాము. అయితే మే 4 నుంచి (మసీదుల నుంచి) లౌడ్‌స్పీకర్లను దించకపోతే, హిందువులందరూ ఆ మసీదుల ముందు రెట్టింపు పరిమాణంలో హనుమాన్ చాలీసా ప్లే చేయాలి" అని పేర్కొన్నారు. మతంలో లౌడ్ స్పీకర్లకు స్థానం లేదని, అందుకే వాటిని తొలగించాలని, పోలీసులు పరిశీలించి తొలగించేలా చూడాలని డిమాండ్ చేశారు. "వారు (ముస్లింలు) సరిగ్గా అర్థం చేసుకోకపోతే, మేము వారికి మహారాష్ట్ర శక్తిని చూపుతాము" అని రాజ్ థాక్రే అన్నారు. "అన్ని లౌడ్ స్పీకర్స్ (మసీదుల పైన) చట్టవిరుద్ధం. ఇన్ని లౌడ్‌స్పీకర్‌లు వాడటానికి ఏమైనా కచేరీనా?" అని ప్రశ్నించారు.
దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు ప్రీతీ శర్మ మీనన్ మాట్లాడుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న MNS చీఫ్ రాజ్ థాక్రే పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కోరారు. అవసరమైతే, ముందస్తు అరెస్టు చేయాలని పేర్కొన్నారు. కాగా, అంతకు మందు లౌడ్ స్పీకర్ల వివాదంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్పందించారు. కొందరు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే లౌడ్ స్పీకర్ల కొత్త డ్రామాను తెరమీదకు తీసుకువచ్చారని ఆరోపించారు. లౌడ్ స్పీకర్ల వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చిన ఎంఎన్ఎస్ నాయకుడు రాజ్ థాక్రే పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా ఆయనకు చురకలంటించారు. "బాలాసాహెబ్‌కు మీరు ఎలా ద్రోహం చేశారో అప్పుడప్పుడు నా కళ్లతో చూశానని బీజేపీని ఉద్దేశించి థాక్రే అన్నారు.
