మహారాష్ట్ర, హర్యానాల్లో ఈనెల 21వ తేదీన ముగిసిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో మహారాష్ట్ర లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకోగా హర్యానాలో మాత్రం కాస్త తడబడింది.
#Election Results 2019: తేలిపోయిన మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు

మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి గురువారం ఓట్ల లెక్కింపు పూర్తయింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237మంది అభ్యర్థులు... బ హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలిపోయింది.
తేలిపోయిన మహారాష్ట్ర,హర్యానా ఎన్నికల ఫలితాలు
ఎర్నాకులంలో కాంగ్రెస్ గెలుపు
కేరళలోని ఎర్నాకులం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి టీకే వినోద్ 21 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఓటమి
హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓటమి పాలయ్యారు. ఖైతాల్ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్ధి లీలా రామ్ చేతుల్లో 567 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు: శరద్ పవార్
ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామన్నారు. ఎన్సీపీ ప్రదర్శనపై తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు.
పుణేలో ఓట్ల లెక్కింపుపై ఎంఐఎం అభ్యంతరం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా పుణేలోని కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంఐఎం రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసింది. అప్పటి వరకు కేవలం 8 రౌండ్లు మాత్రమే ముగిశాయి.
గుజరాత్‌లో కాంగ్రెస్ 3, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యం
గుజరాత్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి
సిక్కిం ఉపఎన్నికలో గెలిచిన సీఎం ప్రేమ్ సింగ్
సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణులకు తెలిపారు.
కిషన్‌గంజ్‌లో ఎంఐఎం అభ్యర్థి విజయం
బీహార్‌లోని కిషన్‌గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి హుడా దాదాపు 11 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్ధి స్వీటీ సింగ్‌పై విజయం సాధించారు.
హర్యానా బీజేపీ చీఫ్ రాజీనామా
హర్యానాలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన రీతిలో ఫలితాలు రానందుకు నైతిక బాధ్యత వహిస్తూ సుభాష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేరళలో సీపీఎం అభ్యర్ధి విజయం
కేరళలోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోని నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సీపీఎం అభ్యర్ధి విజయం సాధించారు.
రెజ్లర్ యోగేశ్వర్ దత్ వెనుకంజ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బరోడా నుంచి పోటీ చేసిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 3,590 ఓట్ల వెనుకబడ్డారు.
పుదుచ్చేరి ఉపఎన్నికలు: కమల్‌రాజ్‌నగర్‌లో కాంగ్రెస్ పాగా
పుదుచ్చేరిలోని కమల్‌రాజ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. హస్తం పార్టీ అభ్యర్ధి జాన్ కుమార్.. ఏఐఎన్ఆర్‌సీ అభ్యర్థి ఎస్. భువనేశ్వరన్‌పై 7,170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఏ మాత్రం ప్రభావం చూపని మహారాష్ట్ర నవనిర్మాణ సేన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 110 స్థానాల్లో బరిలో నిలిచిన ఎంఎన్ఎస్ కేవలం ఒకే ఒక్క స్థానంలో ముందంజలో నిలిచింది.
ఆదిత్య థాక్రేకు సీఎం పదవి..?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. అయితే గతంలో కంటే బీజేపీ సీట్లను కోల్పోయింది. అదే సమయంలో శివసేన మెరుగయ్యింది. దీంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటున్నారు శివసేన ఎంపీ సంజయ్ రావత్.
తాము బీజేపీతోనే కొనసాగుతామని అదే సమయంలో తమ డిమాండ్లను ఆ పార్టీ గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన యువనేత ఆదిత్య థాక్రేకు సీఎం పదవిని ఇవ్వాలని తాము బీజేపీని కోరుతామని సంజయ్ స్పష్టం చేశారు. వర్లీ నుంచి బరిలోకి దిగిన ఆదిత్య దాదాపు 12 వేల ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
#Haryana: 23 వేల ఓట్ల ఆధిక్యంలో భూపిందర్ హుడా
హర్యానా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి భూపిందర్ సింగ్ హుడా 23,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎంఐఎం దెబ్బ
మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై ఎంఐఎం నీళ్లుచల్లింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేసినా సుమారు 40కి పైగా స్థానాల్లో ముస్లిం ఓట్లు భారీగా ఉన్నాయి. ఆ స్థానాల్లోనే బరిలోకి దిగిన ఎంఐఎం ఆ ఓట్లను చీల్చింది. దీంతో బీజేపీ-శివసేన అభ్యర్ధులు అక్కడ ముందంజలో నిలిచారు.
#Maharashtra: గతం కంటే తగ్గిన బీజేపీ సీట్లు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి భారీ ఆధిక్యం సాధించినప్పటికీ కమలనాథులకు సీట్లు గతంలో కంటే తగ్గాయి. ఇదే సమయంలో శివసేన బాగా మెరుగయ్యింది. ఈ క్రమంలో సీఎం పదవి తమ పార్టీకే ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రావత్ డిమాండ్ చేస్తున్నారు.
హర్యానాలో హంగ్: భూపిందర్ హుడాతో ఫోన్‌లో మాట్లాడిన సోనియా
హర్యానాలో హంగ్ పరిస్ధితులు ఏర్పడిన తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడి.. పరిస్ధితి సమీక్షించారు.
మహారాష్ట్ర: ఆరుగురు మంత్రులు వెనుకంజ
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆరుగురు మంత్రులు వెనుకబడ్డారు. వీరిలో పంకజా ముండే, రామ్ షిండే, అతుల్ సవే, విజయ్ శివత్రే, బాలా బేగ్డే, మదన్ యేరావార్ ఉన్నారు.
విజయం దిశగా ఆదిత్య థాక్రే
థాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ఆథిత్య థాక్రే విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వర్లీ నుంచి బరిలోకి దిగిన ఆయన ప్రస్తుతం 12 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.