జీవిత భాగస్వామికి కుష్టు ఉందన్న కారణంతో ఇకపై విడాకులు తీసుకోవడం కుదరదు. ఇందుకు సంబంధించిన ‘‘పర్సనల్ చట్టాల సవరణ బిల్లు-2018’’కి లోక్‌సభ సోమవారం ఆమోదించింది.

బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి పి.పి. చౌదరి మాట్లాడుతూ కుష్టు పూర్తిగా నయమయ్యే వ్యాధి అయినందున ఈ బాధితులను చిన్నచూపు చూడటం, వారి నుంచి విడాకులు కోరడం తగదన్నారు.

దీనికి సంబంధించి గతంలో మానవహక్కుల కమీషన్, న్యాయస్ధానాల తీర్పులు ఉన్నాయని చౌదరి గుర్తుచేశారు. అయితే ఈ బిల్లును మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. మనదేశంలో కుష్టు ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి ముస్లిం దేశాల్లోని న్యాయస్థానాలు సైతం కుష్ఠును పరిగణనలోనికి తీసుకుని విడాకులు మంజూరు చేస్తున్నాయని ఆయన సభ దృష్టికి తెచ్చారు.

‘‘పర్సనల్ చట్టాల సవరణ బిల్లు-2018’’ హిందూ వివాహ చట్టంతో పాటు.. ముస్లిం, క్రైస్తవ, ప్రత్యేక వివాహ రద్దు చట్టాలు, హిందూ దత్తత-మనోవర్తి చట్టానికి ఈ సవరణ వర్తిస్తుందని న్యాయశాఖ తెలిపింది.