Model Code of Conduct : ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే.. ? ఎప్పుడు ప్రవేశ పెడుతారు ? అమల్లోకి వస్తే..?
Lok Sabha election 2024:ప్రతి ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సంబంధిత ప్రాంతంలో ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తుంది. 18వ లోక్‌సభ గాను త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మరోసారి అమల్లోకి రానుంది. అసలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటే ఏమిటి? ఏ విషయాలు నిషేధించబడతాయో తెలుసుకోండి...
Lok Sabha election 2024: దేశవ్యాప్తంగా త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇవ్వాలో .. రేపో.. ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించబోతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వస్తుంది. దీని కారణంగా అనేక ఆంక్షలు కూడా విధించబడతాయి. దేశంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేస్తుంది.ఇందులో పలు నియమ నిబంధనలు ఉంటాయి. వీటిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
నిబంధనలు ఏమిటి?
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు ఎన్నికల సంఘం నియమాలు, నిబంధనలను రూపొందిస్తుంది. ఈ క్రింది విధంగా ఉన్నాయి:-
రాజకీయ పార్టీలకు, నేతలకు...
-వివిధ కులాలు , వర్గాల మధ్య విభేదాలు లేదా ద్వేషాలను ప్రోత్సహించే కార్యకలాపాలలో పాల్గొనవద్దు.
- విధానాలు , చర్యలను విమర్శించండి, ఏ పార్టీ, నాయకుడు లేదా కార్యకర్త వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యానించవద్దు.
-ఏ కులం లేదా వర్గాల మనోభావాలను ఉపయోగించి మీ ఓటు వేయమని విజ్ఞప్తి చేయవద్దు.
- దేవాలయం, మసీదు లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయరాదు.
- ఓటర్లకు లంచం ఇవ్వడం, వారిని బెదిరించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడరాదు.
- పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయడం నేరపూరిత చర్యగా పరిగణించబడుతుంది.
-ఓటింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలపై నిషేధం అమల్లోకి వస్తుంది.
-ఒక రాజకీయ పార్టీ లేదా ఏ అభ్యర్థి ఇంటి ముందు నిరసనలు, ధర్నాలు చేయరాదు.
- అనుమతులు లేకుండా ఏ వ్యక్తి భూమి, భవనం, ప్రాంగణం, గోడలు మొదలైన వాటిపై జెండాలు, బ్యానర్లు వేలాడదీయడం, పోస్టర్లు అతికించడం, నినాదాలు రాయడం వంటివి చేయరాదు.
-రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ మద్దతుదారులు ఇతర పార్టీల సమావేశాలు లేదా ఊరేగింపులలో అడ్డంకులు సృష్టించకుండా, వాటికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించకుండా చూసుకోవాలి.
-ఇతర పార్టీల సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల దగ్గర ఏ పార్టీ కూడా ఊరేగింపు చేపట్టకూడదు. ఒక పార్టీ వేసిన పోస్టర్లను మరో పార్టీ కార్యకర్తలు తొలగించకూడదు.
సమావేశం/ర్యాలీ సమయంలో ..
- అన్ని ర్యాలీలు జరిగే సమయం, ప్రదేశం గురించి పోలీసు అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
- రాజకీయ పార్టీలు, నేతలు తాము సభ నిర్వహించే స్థలంలో ఇప్పటికే ఎలాంటి ఆంక్షలు లేవని ముందుగానే నిర్ధారించుకోవాలి.
- మీటింగ్‌లో లౌడ్‌స్పీకర్ వినియోగానికి కూడా ముందస్తుగా అనుమతి తీసుకోవాలి.
-అనుకోని సంఘటనలు జరగకుండా సభ నిర్వాహకులు పోలీసుల సహాయం తీసుకోవాలి.
ఊరేగింపు నియమాలు ఏమిటి?
- ఊరేగింపుకు ముందు, ప్రారంభ సమయం, మార్గం మధ్య, ముగింపు సమయం, స్థలం గురించి ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వాలి.
- మీరు ఎక్కడి నుంచి ఊరేగింపు తీసుకెళ్తున్నారో ఆ ప్రాంతంలో ఏమైనా ఆంక్షలు ఉన్నాయో లేదో ముందే తెలుసుకోండి.
- ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ఊరేగింపు చేపట్టాలి.
- ఒకటి కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఒకే రోజు , ఒకే మార్గంలో ఊరేగింపును నిర్వహించాలని ప్రతిపాదిస్తే, ముందుగా సమయాన్ని చర్చించండి.
- ఊరేగింపు సమయంలో ఆయుధాలు లేదా ఇతర హానికరమైన పదార్థాలను తీసుకెళ్లవద్దు.
- విధుల్లో ఉన్న పోలీసుల సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించాలి.
పోలింగ్ రోజు సూచనలు
పోలింగ్ రోజున అన్ని రాజకీయ పార్టీలు , అభ్యర్థులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి-
- రాజకీయ పార్టీలు , అభ్యర్థులు తమ అధీకృత కార్యకర్తలకు బ్యాడ్జీలు లేదా గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
- ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో సహకరించాలి.
-ఓటర్లకు ఇచ్చే స్లిప్ సాధారణ కాగితంపై ఉండాలి, దానిపై ఎలాంటి గుర్తు, అభ్యర్థి లేదా పార్టీ పేరు ఉండకూడదు.
-ఓటింగ్ రోజు , 48 గంటల ముందు ఎవరికీ మద్యం పంపిణీ చేయకూడదు.
-పోలింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో అనవసరంగా గుమికూడవద్దు.
-శిబిరం సాధారణ ప్రాంతాలపై ఎలాంటి పోస్టర్, జెండా, చిహ్నం లేదా ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించకూడదు.
-ఓటింగ్ రోజు వాహనం నడిపేందుకు అనుమతి పత్రాన్ని పొందాలి.
పోలింగ్ బూత్: ఎన్నికల కమిషన్ చెల్లుబాటు అయ్యే పాస్ ఉన్న ఓటర్లు తప్ప, ఎవరూ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకూడదు.
పరిశీలకుడు: పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. వారు వాటిని పరిశీలకుల దృష్టికి తీసుకురావచ్చు.
అధికార పార్టీకి కూడా నిబంధనలు ఉన్నాయి
-అధికారిక పర్యటనల సమయంలో మంత్రులు ప్రచారం చేయకూడదు.
-పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ విమానాలు, వాహనాలను ఉపయోగించవద్దు.
-పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఉద్యోగులను ఉపయోగించుకోవద్దు.
- హెలిప్యాడ్‌పై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించవద్దు.
- ప్రభుత్వ నిధులతో పార్టీని ప్రచారం చేయవద్దు,
-కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అభ్యర్థులు, ఓటర్లు లేదా ఏజెంట్లు తప్ప ఇతర వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకూడదు.